calender_icon.png 11 March, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానాస్పద స్థితిలో 9వ తరగతి విద్యార్థిని మృతి

11-03-2025 01:03:33 AM

ఇది ప్రభుత్వ వైఫల్యమే : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఇచ్చోడ, మార్చ్ 10 (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలో విషాదం ఘటన చోటుచేసుకుంది. ఇచ్చోడ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని లాలిత్య (13) హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బజార్హత్నూర్ మండలం మోర్ఖండి గ్రామానికి చెందిన లాలిత్య ఇచ్చోడ గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో ఉంటూ 9వ తరగతి చదువుకొంటుంది.

ఐతే జ్వరంతో లాలిత్య కు ఆదివారం రాత్రి ఫీడ్స్ వచ్చి చనిపోయిందని హాస్టల్ సిబ్బంది చెప్పగా, తమ కూతురికి జ్వరం వచ్చినట్లు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, తమ కూతురి మరణం పై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన తర్వాతే హాస్టల్ సిబ్బంది తమకు చెప్పారని విద్యార్థిని తండ్రి తెలిపారు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించే యత్నం చేసారని ఆరోపించారు.

అటు విషయం తెలుసుకున్న సీఐ భీమేశ్ సోమవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని బోథ్ ఆసుపత్రికి తరలించారు. మృతి పై స్పష్టత తెలిసే వరకు మృతదేహాన్ని తరలించవద్దని కుటుంబీకులు డిమాండ్ చేసిన, పోలీసులు మాత్రం బలవంతంగా ఆసుపత్రికి తరలించారని మృతురాలి సంబంధికులు పేర్కొన్నారు. కాగా హాస్టల్లో విద్యార్థిని లాలిత్య మృతి చెందడం ప్రభుత్వ వైఫల్యమేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.

విద్యార్థి ని మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బోథ్ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చాలామంది విద్యార్థులు హాస్టల్లో  అనారోగ్యంతో చనిపోతున్నారని ఆరోపించారు.

లాలిత్య మృతిపై సమగ్ర విచారణ జరిపి, మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు మృతి చెందుతున్న ఘటనలపై అసెంబ్లీలో చర్చిస్తానని అన్నారు.