calender_icon.png 28 November, 2024 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పంతంతో 4వేల సీట్లకు గండి!

23-10-2024 02:59:50 AM

ఇంజినీరింగ్ సీట్ల కన్వర్షన్, బ్రాంచీల విలీనంతో 

అనుమతి నిరాకరణ 

ఏఐసీటీఈ విధించిన ప్రవేశాల గడువు నేటితో ముగింపు

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): ఈ విద్యాసంవత్సరం ఇంజినీరింగ్‌లో దాదాపు 4 వేలకుపైగా సీట్లకు కోత పడింది. సీట్ల కన్వర్షన్, బ్రాంచీల విలీనం విషయం లో సర్కారు సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం, మొండిగా వ్యవహరించడంతో వేల సీట్లకు గండిపడింది. భర్తీ చేసుకునే అవకాశం ప్రైవేట్ కాలేజీలకు ఇవ్వకపోవడంతో ఆ సీట్లన్నీ వృథా అయినట్లేనని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీటీఈ విధించిన ప్రవేశాల గడువు బుధవారం (నేటి)తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో సర్కారు నుంచి అనుమతి రాకపోవడంతో సీట్లు ఉన్నా భర్తీ చేయలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ హైకోర్టు కాలేజీలకు అనుకూలంగా సోమవారం తీర్పునిచ్చింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. బీటెక్‌లో సీట్ల కన్వర్షన్‌కు ఈ ఏడాది 90 వరకు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా కాలేజీల్లో భర్తీ కాని సీట్లు 4వేలకు పైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌ఈ), వాటి అనుబంధ కోర్సులకు సంబంధించినవే కావడం గమనార్హం.

కాలేజీలు అంతగా డిమాండ్ లేని ఈఈఈ, సివిల్, మెకానికల్ కోర్సుల్లో సీట్లను తగ్గించుకుని, సీఎస్‌ఈలో పెంచుకోవాలని భావించాయి. ఇందుకు జేఎన్టీయూ ఎన్‌వోసీ ఇవ్వగా, ఏఐసీటీఈ సైతం సీట్ల పెంపునకు ఆమోదం తెలిపింది. 

కానీ, సీట్ల కన్వర్షన్‌కు రాష్ర్ట ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీనిపై సంబంధిత కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు మాప్ అప్ కౌన్సెలింగ్‌ను నిర్వహించి సీట్లు భర్తీ చేయాలని తీర్పునిచ్చింది. దీనిపై రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇలా ప్రభుత్వం పంతానికి పోవడంతో 4వేల సీట్లను ఈ ఏడాది భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే రాజకీయంగా తమకు అనుకూలంగా ఉన్న కొన్ని కాలేజీలకు మాత్రం ప్రభుత్వం యథేచ్చగా అనుమతిచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ కారణాలతోనే కొన్ని కాలేజీలకు సీట్ల కన్వర్షన్‌కు అనుమతినివ్వలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏఐసీటీఈ లెక్కల్లో ఆయా సీట్లన్నీ సీఎస్‌ఈకి మారినట్లుగా రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరంలోనైనా ఆ సీట్లన్నీ అందుబాటులోకి వస్తాయేమోనని సంబంధిత కాలేజీ యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.