22-02-2025 12:00:00 AM
నిరుపేదలకు సొంతిల్లు నెరవేరని కలగా మిగిలిపోతున్న ప్రస్తుత కా లమాన పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం పే దల స్వప్నాలను సాకారం చేస్తుంది. ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టసాధ్యమో తెలియజేస్తూ తెలుగు నాట ‘ఇల్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు’ సామెత మనకు తెలిసిందే. ఆకాశాన్నంటుతున్న ధరలతో రోజులు గడపడమే గగనమైన నేటి పరిస్థితుల్లో పేదల కు ఇంటి నిర్మాణం ఎంతో దుర్లభమైంది. పేదలందరికీ గూడునిచ్చేలా భరోసానిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా పాలన ప్రగతి బాట’లో భాగంగా ‘ఇందిరమ్మ ఇళ్ల’ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
80 లక్షలకు పైగా దరఖాస్తులు
సొంత ఇంటి నిర్మాణం సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. రాష్ట్రంలో అర్హత ఉండి ఇళ్లులేని వారు సుమారు 44 లక్షల మందికిపైగా ఉన్నారని ఒక సంస్థ సర్వేలో తేలింది. వీరిలో కొందరు సొంత భూమి కలిగున్నా, ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రూ.22,500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున గరిష్టంగా ఏడాదికి 4.50 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభు త్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయంటేనే సొంతి ళ్ల కోసం ఎంత మంది తపనపడుతున్నారో అర్థమవుతోంది.
లోగడ ఇండ్ల కేటాయింపులో ప్రజాప్రతినిధుల సిఫార్సులకు అధి క ప్రాధాన్యత ఇవ్వడంతో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే విమర్శలొచ్చాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాలకు అతీతం గా ఇండ్ల కేటాయింపుల లబ్ధిదారుల జాబి తా తయారీ కోసం గ్రామ సభలను నిర్వహించింది. గ్రామ సభల ద్వారా స్వీకరిం చిన దరఖాస్తులను పరిశీలించి, పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వ సర్వేయర్లు ప్రతి దరఖాస్తుడి వద్దకెళ్లి విచారణ జరిపారు.
తొలి దశలో స్థలాలున్న వారికి..
రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల కోసం 80 లక్షలకుపైగా దరఖాస్తులు రాగా, వీటిలో సొంత స్థలం ఉన్నవారు, స్థలం లేనివారు 30 లక్షలకు పైగానే ఉన్నారు. మిగిలిన 50 లక్షలకు పైగా దరఖాస్తులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించనుంది. ప్రభుత్వం ఇంటి లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా విభజించింది. స్థలం ఉండి ఇల్లు లేని వారిని ఎల్1, ఇల్లు, స్థలం రెండూ లేని వారిని ఎల్2, స్థలం లేకుండా అర్హులను ఎల్3 విభాగాలుగా విభజించారు.
ఇళ్ల నిర్మాణంలో కాలయాపన జరగకుండా, ఆశావహులు నిరాశ చెందకుండా ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంది. వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో మొదటి దశలో స్థలాలుండి సొంతిల్లు లేని వారికి ఇండ్లు నిర్మించాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నారాయణపేట జిల్లా అప్పకపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించడంతో లబ్ధ్దిదారుల్లో సొంత ఇంటి కలలు నెరవేరబోతున్నాయనే భరోసా కలిగింది.
ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇళ్లు నిర్మించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చడంలో భాగంగా మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభిస్తోంది. స్థలం కలిగున్న లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవడానికి పూర్తి సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వారు సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. నాలుగు విడతలలో మొత్తం రూ.5 లక్షలు లబ్ధిదారులకు చెల్లిస్తారు.
ఇళ్ల కేటాయింపులో పారదర్శకంగా ఉంటూ ప్రభుత్వం ఒక ప్రత్యేక యాప్ ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. లబ్ధిదారుల ఎంపికలోనే కాకుండా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం చెల్లించే రూ.5 లక్షల పంపిణీలో కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసింది మొదలు స్లాబ్ పడే వరకు ప్రక్రియలన్నీ యాప్ ద్వారా పర్యవేక్షించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవడంతో నిధులు పక్కదారి పట్టే అవకాశాలుండవు. యాప్‌లో ఇంటి నిర్మాణ ఫొటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో వచ్చే అప్‌డేట్స్ ఆధారంగానే లబ్ధిదారులకు బిల్లులు విడుదలవుతాయి. ఈ ఇళ్ల నిర్మాణాలన్నింటికీ ప్రభుత్వం ఒక్కో ఇంటికీ 8 ట్రాక్టర్ల చొప్పు ఇసుకను ఉచితంగా అందిస్తుంది.
దేశంలో అందరికీ ఇల్లు సమకూర్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభిం చిన ప్రధాన మంత్రి ఆవాస్‌యోజన (పీఎమ్‌ఏవై) పథకం అన్ని రాష్ట్రాలకు చేదోడుగా నిలుస్తుంది. పీఎమ్‌ఏవై కింద ఒక్కో ఇంటి కోసం పట్టణాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పట్టణాల్లో ఒక్కో ఇంటికి రూ. 3.50 లక్షలు, గ్రామాల్లో రూ.4.28 లక్షలు కేటాయిస్తారు. పీఎమ్‌ఏవై కింద రాష్ట్రానికి 10 లక్షల యూనిట్లు, రూ.15 వేల కోట్లు ఇవ్వాలని తెలంగాణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా నిరాశే మిగిలింది. దేశంలో మొత్తం పట్టణ జనాభాలో తెలంగాణ వాటా కేవ లం 4 శాతమేనని, ఈ లెక్కన రాష్ట్రానికి 4 లక్షల యూనిట్ల ఇండ్ల చొప్పున రూ.6 వేల కోట్లే రానున్నాయి.
గ్రామీణ ప్రాంతాలకు మరో లక్షన్నర యూనిట్ల ఇండ్లు అందనున్నాయి. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం గణాంకాలు తెలంగాణ ఆశలను నీరుకార్చాయి. మరోవైపు పీఎమ్‌ఏవై పథకం కింద దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లు నిర్మించామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా తెలం గాణకు మాత్రం 1.58 లక్షల ఇళ్లు అంటే మొత్తంలో 0.79 శాతం మాత్రమే కేటాయించారు. ఇండ్ల నిర్మాణంలో కేంద్ర ప్ర భుత్వం నుండి ఆశించిన మేరకు సహాయ సహకారాలు లభించకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో భాగంగా ముందడుగు వేయడంతో ఇళ్ల కోసం ఎంతో కాలం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.
స్థలాలు లేని వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు!
స్థలాలున్న వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యతిస్తూ తొలిదశలో పనులు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం స్థలాల్లే ని నిరుపేదలకు కూడా ఇళ్లను అందజేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఒకవైపు స్థలాల సేకరణ చేస్తున్న ప్రభుత్వం, మరోవైపు గతంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో 2.90 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి పాలనా అనుమతులిచ్చి, 2.28 లక్షల ఇండ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు.
అయితే లబ్ధిదారులను ఎంపిక చేయక ముందే ఇండ్ల నిర్మాణాలు చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం పీఎమ్‌ఏవై నిధులు మంజూరు చేయకపోవడంతో తడి సి మోపెడైన ఆర్థిక భారంతో నిర్మాణాలు మందగించి పనులు ఆగిపోయాయి. మొత్తం మీద 60 వేల మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయగా మిగతావి అసంపూర్తిగా, వృథాగా మిగిలిపోయాయి. వివిధ కారణాలతో కేటాయిం పులు జరగని ఇళ్లను గుర్తించడంతోపాటు, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా పూర్తి చేసి వాటినన్నింటినీ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సొంత స్థలాలు లేకుండా ఇళ్లను ఆశిస్తున్న వారికి కేటాయించేందుకు ప్రభు త్వం ఆలోచిస్తోందనే వార్తలతో స్థలా లు లేని లబ్ధిదారుల్లో మాకు కూడా ఇళ్లు వస్తాయనే భరోసా పెరిగింది.
సొంత ఇల్లు నిర్మించుకోలేక ప్రభుత్వం చేయూత కోసం దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంతో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ముందciగు వేయడంతో త్వరలో తమ కలలు నెరవేరబోతున్నాయనే భరోసా కలుగుతుంది. తొలి దశలో సొంత స్థలాలున్న వారికి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ మలి దశలో స్థలాలు లేనివారికి కూడా ఇళ్లను కేటాయించాలని అర్హత గల లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఐ.వి.మురళీకృష్ణ శర్మ