న్యూఢిల్లీ : ముస్లిం మహిళల భరణంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణం పొందేందుకు అర్హులేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. విడాకులు పొందిన మహిళలందరూ భరణం పొందవచ్చని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టైన్ తో కూడిన ధర్మాసనం తీర్పును వెల్లడించింది.
మతాలకు అతీతంగా వివాహిత మహిళలకు సీఆర్పీసీ 125 వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఓ వ్యక్తి భార్యతో విడాకులు తీసుకున్న తరువాత భరణం ఇవ్వాలని ఆదేశాలివ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం మతాలతో సంబంధం లేకుండా భరణం పొందే హక్కు ప్రతి మహిళకీ ఉంటుందని స్పష్టం చేసింది. భరణం అనేది ఏమి విరాణం కాదని తెలుపుతూ.. అది పెళ్లైన ప్రతి మహిళ హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది.