17-03-2025 12:55:03 AM
చేర్యాల, మార్చి 16: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున ఆలయ పరిసర ప్రాంతాలు భక్తి జనసంద్రంగా మారాయి. బ్రహ్మోత్సవాలు భాగంగా తొమ్మిదో వారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. వచ్చే ఆదివారం తో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్న నేపథ్యంలో భక్తులు భారీగా తరలివచ్చార. గంగిరేణి చెట్టు, రాజగోపురం, క్యూలైన్లు, కోనేరు, ప్రసాద విక్రయ కేంద్రం తదితర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ వర్గాలు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. భక్తులు శని వారం రాత్రికే ఆలయాన్ని కి చేరుకుని అక్కడే బస చేశారు.
ఆదివారంవేకువ జామున లేచి, పుష్కరిణి వద్దకు వెళ్లి, పుణ్యస్నానాలు ఆచరించారు. ఆచరించిన వారు నాలుగు గంటల నుండే స్వామివారి దర్శనార్థం క్యూలైన్లో నిల్చున్నారు. స్వామివారి ఆలయ ద్వారం తెరవగానే, గర్భగుడిలో ఉన్న మల్లన్న స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులు మొక్కుకున్న మొక్కుల ప్రకారం ముఖమండపం వద్ద, మరి కొంతమంది గంగిరేణి చెట్టు కింద బోనాలు నైవేద్యంగా సమర్పించి, పట్నాలు వేసి అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామిని వేడుకున్నారు. అనంతరం కొండ పైనున్న ఎల్లమ్మ తల్లికి అప్పు చెప్పులతో, శివసత్తుల పూనకాల మధ్య, బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. మరికొంతమంది ఒడిబియాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కే రామాంజనేయులు తో పాటు మీద పాలకమండలి సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, అంజిరెడ్డి, శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.