calender_icon.png 19 March, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు బిల్లుకు శాసనసభ ఆమోదం

18-03-2025 07:35:32 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు కోసం ఉద్దేశించిన బిల్లును దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గతంలో యాదాద్రిలో భక్తులకు సరైన వసతులు లేవని, కాంగ్రెస్ సర్కారు కోట్లు ఖర్చు పెట్టి వసతులు కల్పించిందని మంత్రి పేర్కొన్నారు. వసతులు ఇంకా మెరుగు పరిచేందుకు 18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలకమండలి బోర్టు ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

సమర్థమైన పాలకమండలిని నియమించి యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలన్ని దేవాదాయశాఖలోకి వస్తాయని, యాదగిరిగుట్ట బోర్డులో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారని, బోర్డు పదవీకాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించామని వెల్లడించారు. బోర్డు ఛైర్మన్, సభ్యులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని సూచించారు. వైటీడీ బోర్డు కూడా విద్య సంస్థలను స్థాపించవచ్చు, నిర్వహించవచ్చు. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక, వేద విద్య సంస్థలను స్థాపించవచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వైటీడీకి బడ్జెట్ ఆమోదం జరిగిందని, వైటీడీకి ఐఏఎస్ స్థాయి అధికారి ఈవోగా ఉంటారని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.