calender_icon.png 21 October, 2024 | 1:44 PM

బీహార్ కల్తీ మద్యం మృతులు 25

18-10-2024 01:31:52 AM

పాట్నా, అక్టోబర్ 17: బీహార్ రాష్ట్రంలోని సరన్, సివాన్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి బుధవారం ఐదు మంది ప్రాణాలు కోల్పోగా పలువురు అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య గురువారానికి 25కి పెరిగింది. మృతుల్లో దాదాపు 20మంది సవాన్ జిల్లాకు చెందినవారు ఉండగా, మిగిలిన 5మంది సరన్ జిల్లాకు చెందినవారు ఉన్నారు. మరో15 మంది తీవ్ర అస్వస్థతతో పాట్నాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. కాగా మృతుల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. మద్యం అమ్మకాలు చేపట్టిన 8మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అందులో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశారు. 

2016 నుంచి 

మద్యం అమ్మకాలపై నిషేధం..

బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం 2016లో మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇది అమల్లో ఉన్నప్పటికీ బ్లాక్ మార్కెట్‌లో అక్రమంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి అనేది బహిరంగ రహస్యం. కల్తీ మద్యం తాగి ప్రజలు మరణించిన సంఘటనలు బిహార్‌లో నిత్యం చోటు చేసుకుంటున్నప్పటికీ ప్రభత్వుం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. 2022లో సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73మంది మరణించిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే.