calender_icon.png 27 December, 2024 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఐఎల్ సంస్థకు చెందిన రూ.48.71 కోట్లు అటాచ్

25-12-2024 02:29:15 AM

* షెల్ కంపెనీలకు రుణాలు మళ్లించారని ఆరోపణలు

* సీబీఐ కేసు ఆధారంగా రంగంలోకి ఈడీ

* మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు షురూ

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, వాటిని దారి మళ్లించిన వ్యవహారంలో ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (టీఐఎల్) సంస్థకు చెందిన రూ.48.71 కోట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. అటాచ్‌ను ధ్రువీకరిస్తూ మంగళవారం ఈడీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. తెలిసిన  వివరాల ప్రకారం.. టీఐఎల్ సంస్థ గతంలో అనేక బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని, వాటిని పక్కదారి మళ్లించిందనే ఆరోపణలపై ఏసీబీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి.

ఈ వ్యవహారంలో ఈడీ రంగ ప్రవేశం చేసి టీఐఎల్ సంస్థపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలపై దాడులు సైతం నిర్వహించింది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంకు రుణాల వినియోగంపై సరైన ఆధారాలు లేకపోవడం, తరచూ కంపెనీ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సీలు) జారీ చేయడం, వర్కింగ్ క్యాపిటల్ పరిమితులపై వడ్డీ చెల్లించకపోవడంతో సదరు బ్యాంక్‌లు సంస్థ రుణ ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణించాయి.

టీఐఎల్ సంస్థ తన గ్రూప్ కంపెనీలు, షెల్ ఎంటీటీలు, ప్రమోటర్లు, డైరెక్టర్ల యాజమాన్యం నియంత్రణలో ఉన్న పలు సంస్థలకు నిధులు మళ్లించాయని ఈడీ ఆరోపిస్తున్నది. సంస్థ నుంచి మొత్తం రూ.85.90 కోట్ల నగదు విత్‌డ్రా అయిందని, ఆ నగదును ప్రమోటర్లు, డైరెక్టర్లు వారి వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించారని పేర్కొంటున్నది. అక్రమంగా పొందిన స్థిరాస్తులను చట్ట ప్రకారం అటాచ్ చేయకుండా నిరోధించే ఉద్దేశంతో కుటుంబ సభ్యులకు బహుమతిగా బదిలీ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని వెల్లడించింది.

టీఐఎల్ డైరెక్టర్లు, ప్రమోటర్లు, దాని సంబంధిత అనుబంధ సంస్థలు షెల్ ఎంటీటీలతో బోగస్ అమ్మకాలు,  కొనుగోలు, లావాదేవీల సహాయం తో అధిక టర్నోవర్(నకిలీ) చూపిందని అనుమానించింది. వివిధ బ్యాంకులకు చెందిన సుమారు రూ.5,115 కోట్లు (వడ్డీతో సహా) టీఐఎల్ సంస్థ డైరెక్టర్లు, ప్రమోటర్లు అనేక షెల్ ఎంటీటీలకు మళ్లాయని, ఆయా సంస్థల్లో డమ్మీ డైరెక్టర్లు నియమితులయ్యారని ఈడీ ఆరోపిస్తున్నది.