30-04-2025 12:00:00 AM
ఎల్బీనగర్ , ఏప్రిల్ 29 : సరూర్ నగర్ చెరువులో ప్రమాదవశాస్తూ పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన పాలకుర్తి శ్రీను, శ్రావణి భార్యభర్తలు. బతుకుతెరువు కోసం 11 ఏండ్ల క్రితం నగరానికి వలస వచ్చి, సరూర్ నగర్ లోని చెరువు కట్టకు అనుకుని ఉన్న గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నంబర్ 14లోని గుడిసెలో నివసిస్తున్నారు. వీరికి నలుగురు ఆడపిల్లలు. కాగా, రెండో కుమార్తె అభిత(6) ఈ నెల 28న (సోమవారం) మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో తల్లిదండ్రులు పక్క ఇంటి వారితో మాట్లాడుతుండగా చిన్నారి గుడిసె పక్కనే ఉన్న చెట్టు కింద ఆడుకుంటున్నది.
కొద్దిసేపటి తర్వాత చిన్నారి అక్కడ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెదికినా ఆచూకీ లభించలేదు. కాగా, మంగళవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో చిన్నారి అభిత మృతదేహం సరూర్ నగర్ చెరువులో తేలుతూ కనిపించింది. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. ఈ మేరకు సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో చిన్నారి ఆడుకుంటూ చెరువులో పడిపోయినట్లు భావిస్తున్నారు. గతంలో చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ. 5.50 కోట్లు విడుదల చేయగా, పనులు టెండర్ల దశలోనే నిలిచాయి. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని గ్రీన్ పార్క్ కాలనీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.