డా. తిరుణహరి శేషు :
భారతదేశం లాంటి అత్యధిక జనాభా గల అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో మెజార్టీ ప్రజలైన బలహీనవర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగాలకు చెందిన గణన జరగకపోవడం వలన తమ దశాబ్దాల వెనుకబాటుతనం దేశం ముందుకు రావటం లేదనే ఆవేదనఆ వర్గాలలో గూడు కట్టుకొని ఉంది.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ 75 సంవత్సరాల కాలంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన స్థితిగతులపై జనగణనలో భాగంగా కులగణన జరగకపోవడం వల్లనే తాము వెనకబడి ఉన్నామని, ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తమకు దక్కటం లేదని బలహీనవర్గాలు బలంగా విశ్వసిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ వర్గాలు జాతి ఆధారిత కులగణన జరగాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నాయి.
1881 నుండి 1931 వరకు బ్రిటిష్ పాలనలో జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులగణన కూడా చేసేవారు. కానీ 1951 నుండి 2011 వరకు 7 పర్యాయాలు జరిగిన జనాభా లెక్కల సేకరణలో భాగంగా మెజార్టీ వర్గాలైన వెనుకబడిన తరగతుల కులగణన చేయటం లేదు. 1948 భారత జనాభా గణాంకాల చట్టం ప్రకారంగా జనగణన చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అయినప్పటికీ బలహీనవర్గాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకున్న బీహార్ ప్రభుత్వం 2022లో రాష్ట్రంలో కులగణనను చేపట్టడం జరిగింది.
బీహార్‌లో కుల గణన తరువాత ఆయా రాష్ట్రాలలోని బలహీన వర్గాల ప్రజలు కులగణన చేయాలనే డిమాండ్ చేయటంతో వారి డిమాండ్‌కు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కుల గణన చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత నవంబర్ 6 నుండి కుల గణనను ప్రారంభించింది.
దశాబ్దాల వెనుకబాటుకు ఎక్సరే
లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా కులగణన జరగాలనే డిమాండ్‌ను రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చారు. దేశంలో ఉన్న అన్నిరకాల అసమానతలు తెలుసుకోవడానికి కులగణన ఒక ఎక్సరేలాగా ఉపయోగపడుతుంది కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘పాంచ్ న్యాయ్’లో భాగంగా హిస్సేదారి న్యాయ్‌లో దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని, రిజర్వేషన్ల పై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తామనే రెండు కీలకమైన హామీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వటం జరిగింది.
దేశంలోని కింది వర్గాల ప్రజలకు సంపదలో, అవకాశాలలో సరైన ప్రాతినిధ్యం దక్కటం లేదు కాబట్టి అసమానతల స్థాయిని తెలుసుకోవడానికి, రిజర్వేషన్లను మరింత హేతుబద్ధంగా అమలు చేయడానికి, బడ్జెట్‌లో నిధులను కేటాయించటానికి, ప్రభుత్వ విధానాలను రూపొందించడానికి, సంక్షేమ పథకాల రూప కల్పనకు, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేయటానికి, పేదలను గుర్తించటానికి, వనరుల పంపిణీకి కులగణన అవసరమనే అభిప్రాయానికి దేశవ్యాప్తంగా సానుకూలత వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలో కులగణన డిమాండ్ పై ఆర్‌ఎస్‌ఎస్ నుండి కూడా సానుకూలమైన ప్రకటన రావటం ఆహ్వానించదగిన పరిణామమే. కులాల ఆధారంగా వెనుకబాటుతనాన్ని గుర్తించ వచ్చని 1992 ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సామాజిక, ఆర్థిక అసమానతలు విస్తృతంగా ఉన్న మనలాంటి దేశంలో సామాజిక, ఆర్థిక న్యాయం కులగణన ద్వారానే సాధ్యమవుతుందనే విషయాన్ని విస్మరించకూడదు.
1953 కాకా కలేల్కర్ కమిషన్, 1978 మండల్ కమిషన్, 2017 జస్టిస్ రోహిణి కమిషన్‌లు కూడా సామాజిక ఆర్థిక అసమానతలను తెలుసుకోటానికి కులగణన జరగాలని అభిప్రాయపడ్డాయి. స్వాతంత్రం వచ్చిన ఈ 78 సంవత్సరాలలో లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరకపోవటానికి, ప్రభుత్వ విధానాలు లక్ష్యాలను చేరుకోలేకపోవటానికి కారణం ప్రభుత్వాలు కుల గణన చేపట్టకపోవటమేనని గుర్తించాలి.
తెలంగాణ రోల్‌మోడల్ కాబోతుందా?
2022లో బీహార్ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇటు తెలంగాణలోనూ కులగణన చేపట్టాలనే డిమాండ్ ప్రజల నుండి వచ్చిన నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు కూడా కులగణనకు ముందుకు వచ్చాయి ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వం మారటంతో కులగణన ప్రక్రియ పై స్పష్టత లేదు కానీ తెలంగాణలో మాత్రం కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే కోసం జీవో నెంబర్ 26 విడుదల చేస్తూ 150 కోట్ల రూపాయలను కేటాయించింది.
నవంబర్ 6 నుండి రాష్ట్రవ్యాప్తంగా కుల గణనను ప్రభుత్వం ప్రారంభించింది. కుల గణన ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కుల గణనలో దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలబడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
జాతి ఆధారిత కులగణన తరువాతనే బీహార్‌లో బీసీల రిజర్వేషన్లు 33శాతం నుండి 43 శాతానికి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 17 శాతం నుండి 23 శాతానికి పెరిగాయనే విషయాన్ని గమనించాలి. అలాగే 34 శాతం బిహారీ ప్రజల రోజువారీ ఆదాయం కేవలం 200 రూపాయలు అంటే నెల వారీఆదాయం 6000 రూపాయలు మాత్రమేనని సర్వేలో తేలింది. అంటే బీహార్‌లో రిజర్వేషన్ల పెంపునకు, ఆర్థిక స్థాయిని, అసమానతలను అంచనా వేయటానికి కులగణన దోహద పడిందనే చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలలో బీసీల రాజకీయ వెనుకబాటుతనం అంచనాకు, స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 23 శాతం నుండి 42 శాతానికి పెంచటానికి, ఆయా సామాజిక వర్గాల ఆర్థిక స్థాయిలను, వెనుకబాటుతనాన్ని గుర్తించటానికి కులగణన ఉపయోగ పడబోతుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సమగ్ర సమాచారాన్ని తెలుసుకోటానికి ప్రభుత్వం 75 ప్రశ్నలతో కూడిన ఫార్మాట్ ని రూపొందించడమే కాదు వీలైనంత ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టటానికి 85 వేల మంది ఎన్యుమరేటర్స్‌ను వినియోగిస్తోంది.
కాబట్టి తెలంగాణలో చేపడుతున్న కులగణన దేశంలో ఒక రోల్ మోడల్ గా నిలబడటానికి అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లెక్కలు కాదు ఆచరణాత్మకం కావాలి
బీహార్‌లో కులగణన తరువాత 50 నుండి 65 శాతానికి పెంచిన రిజర్వేషన్లను పాట్నా హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం ఒకవైపు కుల గణన, మరొకవైపు భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో డెడికేటెడ్ బీసీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కులగణన ద్వారా వెనకబాటుతనానికి ముఖ్యంగా రాజకీయ వెనుకబాటుత నానికి సంబంధించిన ఒక ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడం ద్వారా స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 42 శాతం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అన్ని మార్గాలను వెతుకుతుందనే విశ్వాసాన్ని బలహీనవర్గాలకు కల్పించడమే కాకుండా రిజర్వేషన్లను సాధించటానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పని చేయాల్సిన అవసరం కూడా ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత 2014లో నాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే (ఎస్‌కెఎస్) చేసి వివిధ కులాల లెక్కలు తీసినప్పటికీ బలహీనవర్గాల నుండి లెక్కలు బయటపెట్టాలనే డిమాండ్ వచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయా కులాల లెక్కల వివరాలను బయట పెట్టలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణనద్వారా వివిధ సామాజిక వర్గాల లెక్కలు తీయటమే కాదు వారి స్థితిగతులను, వెనుకబాటుతనాన్ని బయటపెట్టాలి.
కుల గణన ఆధారంగా వారి వెనుకబాటుతనాన్ని రూపుమాపటానికి తగు చర్యలు చేపట్టినప్పుడే కుల గణన లక్ష్యమైన సామాజిక న్యాయం, ఆర్థిక, సమాన న్యాయమనే లక్ష్యం నెరవేరుతుంది. కుల గణన చేపట్టటం ద్వారా తమ వెనుకబాటుతనానికి ఒక పరిష్కారం దొరుకుతుందని బలహీనవర్గాలు విశ్వసించారు కాబట్టే 17 వ లోక్ సభలో ఒక సాధారణ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ 18వ లోక్ సభలో దేశ ప్రతిపక్ష నాయకుడు స్థానానికి ఎదిగారనే విషయాన్ని గమనించాలి. కులగణన కేవలం డిమాండ్ కాదు అది ఒక జాతి ఆకాంక్ష అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తాయని ఆశిద్దాం.
-వ్యాసకర్త సెల్: 9885465877