26-02-2025 12:00:00 AM
పటాన్ చెరు, ఫిబ్రవరి 25 : సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటును నిరసిస్తూఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పట్టభద్రులు ప్రకటించారు. మంగళవారం గుమ్మడిదలలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పట్టభద్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలనే ఈ అడుగులు వేశామని చెప్పారు. ప్రభుత్వం దిగివచ్చి డంపింగ్ యార్డు ఏర్పాటును వెంటనే నిలిపేయాలని వారు డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నల్లవల్లి, కొత్తపల్లి, గుమ్మడిదలలో చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం నాటికి 21వ రోజుకు చేరుకున్నాయి. తక్షణమే డంపింగ్ యార్డును నిలిపివేయాలని కోరుతూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు, మహిళలు జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి దున్నపోతుకు వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలిపారు. నల్లవల్లి, కొత్తపల్లిలో చేపట్టిన నిరసన దీక్షలో గ్రామస్తులు పనులు మానేసి కూర్చుంటున్నారు. తమకు డంపింగ్ యార్డు ప్రధాన సమస్య అని, అది పరిష్కారం అయితే చాలని తెలిపారు.