తనను ఆదరించి అన్నం పెట్టిన వారి రుణాన్ని ఓ వ్యక్తి ఎలా తీర్చుకున్నాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మరపురాని మనిషి’. 1973 నవంబర్ 23న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, జయంతి ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్వీ రంగారావు, జగ్గయ్య, మంజుల, చంద్రమోహన్, లత కీలక పాత్రలు పోషించారు. తాతినేని రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ ఉమా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎన్‌ఎన్ భట్ నిర్మించారు.
ఈ సినిమా మలయాళ చిత్రం ‘ఒడైల్ నిన్ను (1965)కు రీమేక్. అనాథైన అబ్బి (అక్కినేని నాగేశ్వరరావు) రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని మంచితనం కారణంగా కాలనీలో అంతా అతడితో ఆదరంగా ఉంటారు. హోటల్ యజమాని రంగయ్య (ఎస్వీ రంగారావు) అతన్ని కొడుకుగా చూస్తాడు. కానీ అతని సాయం మాత్రం అబ్బి తీసుకోడు. అతడు లక్ష్మి (మంజుల)తో ప్రేమలో పడతాడు. ఒకరోజు కష్టంలో ఉన్న శంకర్ (జగ్గయ్య) కుటుంబానికి సాయం చేస్తాడు.
శంకర్ తన భార్య పార్వతి (జయంతి)తో కలిసి అబ్బికి తమ ఇంట్లో మంచి ఆతిథ్యమిస్తుంది. అప్పటి నుంచి శంకర్ కూతురు (బేబి శ్రీదేవి)ని అబ్బీయే తన రిక్షాలో స్కూలుకు తీసుకెళుతుంటాడు. తన కూతురిని గ్రాడ్యుయేషన్ చేయించాలని ఓ సందర్భంలో అబ్బికి శంకర్ చెబుతాడు. ఒకరోజు లక్ష్మిని ఓ వ్యక్తి మానభంగం చేసి చంపేస్తాడు. ఆ కోపంలో ఆ రౌడీని అబ్బి చంపేసి జైలుకి వెళతాడు. విడుదలై వచ్చిన అబ్బికి అమ్ములు బిచ్చగత్తెగా.. పార్వతి వితంతువుగా కనిపిస్తుంది.
అసలు శంకర్ ఎలా మరణించాడు? ఆ తరువాత ఆ కుటుంబానికి అబ్బి ఎలా సాయంగా నిలిచాడు? అనే అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఆద్యంతం ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ‘మరుపురాని మనిషి’ని చూసిన వారు దీనిని మరచిపోలేరు.