calender_icon.png 24 October, 2024 | 2:49 AM

ప్రపంచానికి కొత్తదారి

24-10-2024 12:00:00 AM

 యూరప్, ఆసియా ఖండాల్లో భీకరమైన యుద్ధాలు జరుగుతున్న వేళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న రెండు దేశాల ఘర్షణలు యుద్ధాలుగా మారకుండా ఎలా వ్యవహరించాలనే అంశంపై ప్రపంచానికి కొత్త మార్గం చూపాయి. జనాభాతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నాయకత్వం వహించేందుకు పోటీ పడుతున్న ఇండియా చైనా సుదీర్ఘ సరిహద్దు వివాదానికి తాత్కాలికంగానైనా ఒక ముగింపునిచ్చాయి. 3,500 కిలోమీటర్ల సుదీర్ఘంగా, అత్యంత క్లిష్టంగా ఉన్న మంచుకొండల సరిహద్దుల్లో ఎవరి హద్దుల్లో వారు బాధ్యతగా మెలగాలని నిర్ణయానికి వచ్చాయి.

భారత్ సరిహద్దు సమస్య ఇప్పటిది కాదు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఉన్నది. 1962 యుద్ధం తర్వాత అది మరింత వివాదాస్పదమైంది. 2020లో తూర్పు లఢక్‌లోని గల్వాన్‌లో రెండు దేశాల సైనికులు ఘర్షణకు దిగి తీవ్ర ప్రాణ నష్టం జరిగిన తర్వాత ఇప్పటివరకు పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో దైపాక్షిక చర్చలు కూడా జరుగలేదు. దాదాపు ఐదేండ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రష్యాలో బ్రిక్స్ సదస్సు వేదికగా బుధవారం మరోసారి ముఖాముఖి సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

కమ్యూనిజం నుంచి సామ్రాజ్యవాదం వైపు అడుగులేస్తున్న చైనా.. విస్తరణ కాంక్షతో తన చుట్టూ ఉన్న దేశాలన్నింటితో తరుచూ కయ్యానికి దిగు తున్నది. దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనంటూ హూంకరిస్తున్నది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ప్రదేశ్, లఢక్ కూడా తనదేనని వాదిస్తున్నది. భారత్‌లోని అనేక ప్రాంతాలను చైనా పాలకులు తమ దేశ మ్యాప్‌లో చూపుతూ సొంత పేర్లు కూడా పెట్టుకొన్నారు. వీటన్నింటినీ ఖండిస్తూ వస్తున్న భారత్ ఏ దశలోనూ సంయమనం కోల్పోకుండా దౌత్యనీతిని పాటిస్తూ వస్తున్నది. 2020 మే 5వ తేదీ అర్ధరాత్రి వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ ప్రాంతంలో భారత సరిహద్దుల్లో చొచ్చుకురా వటంతో తెలుగువాడైన కర్నల్ సంతోష్‌బాబు నేతృత్వంలో భారత సైనికులు అడ్డుకొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో సంతోష్‌బాబు తోపాటు 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా వైపు అంతకంటే ఎక్కువే చనిపోయారని వార్తలు వచ్చాయికానీ.. ఆ వివరాలు చైనా ఇప్పటివరకు బయటపెట్టలేదు. 1962 యుద్ధం తర్వాత ఈ దేశాల మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణ ఇదే. ఈ ఘర్షణతో రెండుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, ఇది మరిన్ని ఘర్షణలకు దారితీయకుండా రెండు దేశాలు జాగ్రత్తలు తీసుకొన్నాయి. ప్రపంచంలో రెండు శక్తిమంతమైన, అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణ పెరిగితే వినాశనం తప్పదు. ఈ విషయంలో చైనాకంటే భారత్ కనబరిచిన దౌత్య నీతికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.

గల్వాన్ ఘర్షణ తర్వాత ఈ నాలుగేండ్లు రెండు దేశాల సైన్యం సరిహద్దు సమస్యపై చర్చలు జరుపుతూనే ఉన్నది. తూర్పు లఢక్‌లో 2020కి పూర్వపు హద్దుల్లో రెండు దేశాల సైన్యం పెట్రోలింగ్ నిర్వహించుకోవాలన్న భారత ప్రభుత్వ వాదనకు ఇంతకాలం చైనా ఒప్పుకోలేదు. కానీ, ప్రపంచ తాజా పరిణామాలు ఆ దేశంలో మార్పు తెచ్చినట్లు కనిపిస్తున్నది. భారత్‌తో కయ్యం కంటే నెయ్యమే మేలనే నిర్ణయానికి వచ్చింది. దీంతో గత సోమవారమే రెండు దేశాల సైన్యాలు పూర్వపు హద్దుల్లో పెట్రోలింగ్ చేసుకొనేందుకు ఒప్పందం చేసుకొన్నాయి. ఈ ఒప్పందానికి బ్రిక్స్ వేదికగా మోదీ జిన్‌పింగ్ ఆమోదముద్ర వేశారు.

ఒకానొక సమయంలో భీకర యుద్ధం తప్పదేమోనన్న భయం పుట్టింది. ఆ దశనుంచి అత్యంత పరిణతితో సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొన్న భారత్ దృక్పథం ఇప్పుడు ప్రపంచానికి మార్గదర్శనంగా కనిపిస్తున్నది. ఒకవైపు రెండేండ్లకుపైగా సాగుతున్న  రష్యా యుద్ధం, ఏడాది దాటిపోయినా ఎటూ తేలకుండా సాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధాలకు ఓ ముగింపు ఇచ్చేందుకు భారత్ ఒప్పందం స్ఫూర్తిగా నిలుస్తున్నది.