calender_icon.png 10 March, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమ చరిత్రలో సువర్ణ అధ్యాయం

09-03-2025 01:15:00 AM

స్వరాష్ర్ట సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అదో కీలక ఘట్టం. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవం. యావత్ దేశమే కాదు ప్రపంచ దేశాలను సైతం తనవైపుకు తిప్పుకున్న సందర్భం. తెలంగాణ సమాజాన్ని ఒక్క వేదికపైకి తెచ్చిన రోజు. దశాబ్దాల ఆవేశం, ఆక్రోశం కలగలిపిన ఉద్యమం విధ్వంసంగా మారిన క్షణం. అంతేకాదు.. ఉద్యమ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. అదే మిలియన్ మార్చ్. ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఈ ఘటనకు సరిగ్గా పదిహేనేళ్లు.

ఉద్యమ చరిత్రలో 2011, మార్చి 10  నిప్పు కణికలాంటి రోజు. స్వరాష్ర్ట కాంక్ష జ్వాలై రగిలిన రోజు. మహోద్యామాన్ని కీలక మలుపుతిప్పిన మహాదృశ్యం. ఆంక్ష లు, నిర్బంధాల కట్టడిని బద్దలుకొట్టుకుని లక్షలాదిగా తరలివచ్చిన వారితో ట్యాంక్ బండ్ జనసంద్రాన్ని తలపించింది. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా.. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. ఆనాడు మిలియన్ మార్చ్ ధాటికి పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు.

ఓ కెరటంలా ఎగిసి పడ్డ ఈ కార్యక్రమం ఉద్యమకారులకు, ప్రజలకు మానసిక స్థుర్యైన్ని ఇచ్చింది. మిలియన్ మార్చ్‌కి చాలా భారీ ఎత్తున జరపాలనేది తెలంగాణ జేఏసీ వ్యూహం. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా జేఏ సీ సంఘాలతోపాటు అన్ని ప్రధాన పార్టీలు, ఇతర ఉద్యోగ, ప్రజా సంఘాలు మార్చ్ జరిపే తీరాలని గట్టిగా పట్టుబట్టాయి. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఓ రోజంతా చర్చించిన జేఏసీ ఫైనల్‌గా ర్యాలీ చేపట్టాలని డిసైడ్ చేసింది. ప్రజల నుంచి మిలియన్ మార్చ్ ప్రచారానికి అపూర్వ స్పందన రావడంతో అప్పటి టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కూడా కలసికట్టుగా కదిలాయి.

మిలియన్ మార్చ్‌కు తెలంగాణ ఉద్యమకారులు ముందస్తు వ్యూహాలు సిద్ధం చేసుకు న్నారు. పోలీసుల ఎత్తుగడలకు అంతు చిక్క ని విధంగా వ్యూహాలు రూపొందించారు. మార్చ్‌ని ఫెయిల్ చేయాలని ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించింది. జిల్లాల బోర్డర్లలో పోలీసుల దిగ్బంధాలు, అడ్డంకులు, బ్యారికేడ్లు, ఇనుపకంచెలూ తెలంగాణవాదులను ఆపలేకపోయాయి. నలుమూలల నుంచి వరదలా దూసుకొచ్చిన ఉద్యమకారుల నినాదాలతో మహానగరం ప్రతిధ్వనిం చింది. మిలియన్ మార్చ్‌కు ముందే చాలామంది నేతలను, జేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే హరీశ్‌రావు తన సహచర ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డితో కలిసి బోట్‌లో హుస్సేన్‌సాగర్ మధ్య నుంచి ట్యాంక్ బండ్‌కు చేరడానికి ప్రయత్నించారు. మధ్యలో పోలీసులు అడ్డుపడటంతో నీటిలో దూకుతానంటూ బెదిరించారు. ట్యాంక్‌బండ్‌పైకి వచ్చిన నాటి కాంగ్రెస్ నేతలు కేకే, మధుయాష్కీ కార్లపై ఉద్యమకారులు దాడులకు దిగారు. పోలీసులను, పారామిలటరీ బలగాలను మోహరిం చినా ఫలితం లేకుండా పోయింది. ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టలేనంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారు తెలంగాణ వాదులు. మొత్తం తెలంగాణ లో లక్ష మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకోగా, ఒక్క హైదరాబాద్ లోనే 11వేల మందిని అరెస్టు చేశారు.

ఈ మిలియన్ మార్చ్‌కు కేసీఆర్ సాయంత్రం నాలుగు తర్వాత ట్యాంక్ బండ్‌కు చేరుకున్నారు. జై తెలంగాణ నినాదాలు.. ఆటా పాటా.. ఉద్యమ హోరుతో జంటనగరాలు ఊర్రూతలుగాయి. ఇంతింతై వటుడింతై అన్నట్టు చూస్తుండగానే సాగరతీరం జనసంద్రమైంది. కట్టడి చేసే క్రమంలో పరిస్థితి కంట్రోల్ తప్పింది. విగ్రహాల ధ్వంసాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. టీ జేఏసీ తర్వాత చేపట్టిన సాగరహారానికి మిలియన్ మార్చ్ స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఘటనను బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రస్తావించాయి.

పోలీసులు బెదిరించినా వెనక్కి తగ్గలేదు

మిలియన్ మార్చ్‌కు రెండు రోజుల ముందే ప్రజా గాయకుడు గద్దర్ చేత పోస్టర్ ఆవిష్కరణ చేయించా. ఆరోజు నుంచే నాపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. కేసులు పెడుతామని వార్నింగ్ ఇవ్వడంతో తప్పించుకొని తిరిగా. నా మీద పీడీయాక్ట్ పెడుతారనే విషయం గద్దర్‌తో చెప్పారు. ‘ఉద్యమంలో పాల్గొన్నందుకు పోలీసులు కేసులు పెడుతారు. అరెస్టులు కూడా చేస్తారు. కాని స్వరాష్ట్రం కోసం మనం మాత్రం మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేద్దాం’ అని ధైర్యం చెప్పారు. అయితే పోలీసులు గుర్తుపట్టకుండా శరీరమంతా రంగులు పూసుకొని మార్చ్‌లో పాల్గొన్నా. ‘తెలంగాణ నా జన్మహక్కు’ అనే ప్లకార్డుతో ప్రత్యక్ష్యమై ఎంతోమందిలో స్ఫూర్తి నింపా. ప్రపంచ ఉద్యమాల్లో మిలియన్ మార్చ్ గొప్ప ఉద్యమంగా రికార్డుకెక్కింది. 

 గోర శ్యాంసుందర్, తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ, వ్యవస్థాపక అధ్యక్షుడు

జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించాం

మిలియన్ మార్చ్ సమయంలో నేను పీడీఎస్‌యూ గ్రేటర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నా. అప్పటికే మా పార్టీ పిలుపునివ్వడంతో విద్యార్థులను, నాయకులను దాదాపు 200 మంది దాకా ఏకం చేశా. అయితే పోలీసులకు అనుమానం రాకుండా విడుతలవారీగా ట్యాంక్ బండ్ వైపు వెళ్లాం. అక్కడ అందరం ఏకమై జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ ముందుకెళ్లాం. ఈక్రమంలో అప్పటి డీసీపీ ఒకరు మమ్మల్నివారిస్తే నెట్టుకుంటూ మరీ దూసుకెళ్లాం. ఈ క్రమంలో కొంతమంది నాయకులకు గాయాలు కూడా అయ్యాయి. అయినా ట్యాంక్‌బండ్‌ను విడిచిపెట్టలేదు. కేవలం పీడీఎస్‌యూ నుంచే వందమందిపైగా తరలించి మార్చ్‌ను విజయవంతం చేశా.

 మామిడికాయల పరశురాం, మాజీ స్టేట్ ప్రసిడెంట్, పీడీఎస్‌యూ

- చేతన్