ముక్కోణపు ఫైట్!

18-04-2024 03:10:44 AM

l రాష్ట్రంలో రసవత్తరంగా పోరు

l నువ్వా, నేనా అన్నట్లుగా సాగుతున్న ప్రచారం

l అసెంబ్లీ ఫలితాలకు భిన్నమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం 

l కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పేలుతున్న మాటల తూటాలు

l రాష్ట్రంలో నెలకొన్న కరువుపై కేసీఆర్ ఫైర్ 

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి) : సార్వత్రిక ఎన్నికల గడువు ముంచుకొస్తున్నది. నామినేషన్ల స్వీకరణ ఘట్టం కూడా మొదలు కావడంతో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే ముహూర్తాలు చూసుకొని నామినేషన్ వేసే తేదీలను ఖరారు చేసుకున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా పార్టీల అధినాయకులతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. గతానికి భిన్నంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ద్విముఖ పోటీ కనిపిస్తుండగా.. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. దీంతో ప్రధాన పార్టీలు మెజార్టీ లోకసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న ప్రచారంతో అభ్యర్థులు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

ఆరోపణలకు దీటుగా ప్రత్యారోపణలు

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతుంది. బీఆర్‌ఎస్ ఎంపీల గెలుపుకోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థుల కోసం కిషన్‌రెడ్డితో పాటు రెండు జాతీయ పార్టీల రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా నాలుగు నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ల మద్య ప్రతిరోజు మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో వర్షపాతం అంతంతే ఉండటం, తీవ్రమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు అడుగంటడంతో తెలంగాణలోని నగరాల్లో తాగునీటి కష్టాలు, గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువును లక్ష్యంగా చేసుకొని బీఆర్‌ఎస్ ఆరోపణలు ఎక్కు పెడుతుంది. కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్‌ఎస్ నాయకులు ఘాటుగా విమర్శిస్తున్నారు. దీంతో పాటు అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. అయితే.. గత పదేండ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వమే నేటి కరువుకు కారణమని బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ ప్రతిదాడి చేస్తుంది.

సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు కేసీఆర్ పాలన, బీఆర్‌ఎస్ నాయకులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సందులో సడేమియా అన్న చందంగా తెలంగాణ రాష్ట్రంలో కరువుకు నాటి బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆరోపిస్తూ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఏకంగా రైతుదీక్ష చేపట్టారు. కేంద్రంలో మరోదఫా నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపర్చాలని తెలంగాణ ఓటర్లను అభ్యర్థించారు. 

వార్ వన్ సైడ్ లేనట్లే..

ప్రజల్లో జనాధరణ ఉన్న పార్టీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేసినా గెలుస్తాడు అనే అభిప్రాయం కలిగేది. అలాగే జనాధారణ ఉన్న నాయకుడు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తాడనే నమ్మకం ఉండేది. కానీ ఇది ఒకప్పుడు. ప్రస్తుతం పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి ఓడుతారు అని చెప్పడం అంత సులువు కాదనే చెప్పాలి. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల వార్ వన్ సైడ్ లేదని ఇప్పటికే తేలిపోయింది. గత బీఆర్‌ఎస్‌పై ఉన్న ప్రజా వ్యతిరేఖతను అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకుగా మలచుకుంది. ఈ క్రమంలోనే సరాసరిగా 1.08శాతం మెజార్టీ ఓట్లతో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేజెక్కించుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో తలెత్తిన కరువు పరిస్థితుల కారణంగా కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేఖత కాంగ్రెస్‌ను చుట్టు ముట్టిందని చెప్పాలి.

ముఖ్యంగా సాగు, తాగునీటితో పాటు కరెంట్ సమస్యలు, రైతుబంధు, ఆసరా పింఛన్ల పెంపుదల, రూ. 2లక్షల రుణమాఫీ వంటి హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడుతున్నారు. అయితే కాంగ్రెస్‌పై వచ్చిన ఈ ప్రజా వ్యతిరేకతను బీఆర్‌ఎస్, బీజేపీ తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటుందా? లేదా? అనేది చూడాలి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ప్రభావం హెచ్‌ఎండీఏ పరిధిలోని ఓటర్లపై ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. 

పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీల బలబలాలు

హైదరాబాద్...

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 19,57,931మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులకు మొత్తం 4,23,150 ఓట్లు పొలవగా.. మలక్‌పేట్, కార్వాన్, చాంద్రాయనగుట్ట, యాకత్‌పురా, బహాదూర్‌పురా, చార్మినార్ అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థులకు 2,17,469 ఓట్లు పోలవగా.. గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కేవలం 91,085 ఓట్లు, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు 1,65,459 ఓట్లు పోలయ్యాయి. 

సికింద్రాబాద్...

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఓటర్లు 18,93,647 మంది ఓటర్లున్నారు. ఇందులో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు 4,49,824 ఓట్లు పోలవగా, సికింద్రాబాద్, ఖైరతాబాద్, కంటోన్మెంట్, అంబర్‌పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. నాంపల్లిలో మాత్రం 70,033 ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థులకు 2,78,938 ఓట్లు, బీజేపీ అభ్యర్థులకు 2,27,559 ఓట్లు పోలయ్యాయి.

మల్కాజిగిరి... 

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) గెలుపొందింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 31, 50, 303 మంది ఓటర్లు ఉండగా, ప్రధాన పార్టీలైనా బీఆర్‌ఎస్‌కు 9,38,064 ఓట్లు, కాంగ్రెస్‌కి 5,82,974 ఓట్లు, బీజేపికి 3,86,680 ఓట్లు పోలయ్యాయి. 

చేవెళ్ల...

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోకవర్గాల పరిధిలో 29,14,124 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు 7,07,456 ఓట్లు పోలవగా.. చేవెళ్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు 6,09,527 ఓట్లు పోలవగా, తాండూర్, వికారాబాద్, పరిగి అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థులకు 3,35,504 ఓట్లు పోలయ్యాయి.  

భువనగిరి...

భువనగిరి పార్లమెంట్ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 15,71,520 ఓట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు 7,34,087 ఓట్లు పోలవగా.. భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు 4,61,027 ఓట్లు పోలవగా, కేవలం జనగాం అసెంబ్లీ స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థులకు కేవలం 74,782 ఓట్లు పోలయ్యాయి. 

జహీరాబాద్...

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో 16,35,042 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థులకు 5,49,143 ఓట్లు పోలవగా ఎల్లారెడ్డి, జుక్కల్, నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మొత్తం 5,30,499 ఓట్లు పోలవగా, బాన్సువాడ, జహీరాబాద్ అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచారు. బీజేపీకి 1,49,081 ఓట్లు పోలవగా, కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 

మెదక్...

మెదక్ పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18,12,858 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థులకు 4,20,876 ఓట్లు పోలవగా కేవలం మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మొత్తం 6,68,955 లక్షల ఓట్లు పోలవగా.. గజ్వేల్, సిద్దిపేట, సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచారు. బీజేపీకి 2,05,035 ఓట్లు పోలయ్యాయి కానీ ఏ ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు.