నగరంలో కన్నీటి కష్టాలు

18-04-2024 03:05:33 AM

l బస్తీల్లో ట్యాంకర్ల వద్ద సిగపట్లు

l నగర శివార్లలో ఎండిన బోర్లు

l క్రమంగా పెరుగుతున్న డిమాండ్ 

l డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేని వైనం

l వేసవికిముందే ఇలా ఉంటే మున్ముందు ఎట్లనో

l భయాందోళనలో నగర ప్రజలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): మండుతున్న ఎండలు ఒకవై పు.. మరోవైపు అడుగంటిన భూగర్భజలాల కారణంగా తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. గతంలో కోర్‌సిటీ తాగునీటి అవసరాలను తీర్చే వాటర్‌బోర్డుకు ప్రస్తుతం అవుటర్ రింగ్‌రోడ్డు వరకు విస్తరించడంతో కోటికి పైగా జనాభా తాగునీటి అవసరాలను తీర్చేందుకు  వాటర్‌బోర్డు అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో ప్రస్తుతం మహానగరంలో ఎండలకు తోడు తాగునీటి కన్నీటి కష్టాలు మొదలయ్యాయి.  2017లో తలెత్తిన సమస్యనే మళ్లీ ఇప్పుడు పునరావృతం అవుతోంది. ఏడు ఏండ్ల నుంచి లేని నీటి సమస్య మళ్లీ.. ప్రస్తుతం తీవ్ర ఇబ్బంది పెడుతుంది.

రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తుండటంతో పాటు లో ఇస్తుండటంతో సరిపోక ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. బస్తీల్లో ట్యాంకర్ల వద్ద సిగపట్లు పడుతుండటంతో పాటు నగర శివారులో ఎండినబోర్లతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మహానగరంలో గుక్కెడు నీటికోసం జనం అల్లాడుతున్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాటర్‌బోర్డు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నా.. ప్రస్తుతం నగర వాసుల గొంతేండుతోంది. ఎందుకంటే వాటర్‌బోర్డు సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోవడం లేదనే స్పష్టంగా కనిపిస్తోంది. కోర్‌సిటిలో దాదాపు 291 కాలనీలున్నాయి.

మహానగరంలో గుర్తింపు పొందిన 1700 మురికివాడలు, బస్తీల ప్రజలు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరకొర నీటి సరఫరాతో బస్తీవాసులు డ్రమ్ముల్లో నీటిని నింపుకుంటూ, మరికొందరూ వాటర్‌ట్యాంకర్ల కోసం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా నగరంలోని బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలోని భగత్‌సింగ్ నగర్‌తో పాటు శ్రీరాంనగర్ బస్తీ, శ్రీరాంనగర్ కలాన్, పాలమూరు, సూర్యనగర్ బస్తీల్లో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.  సంస్థ పరిధిలో నిత్యం 7000 నుంచి 8500 వరకు ట్యాంకర్లు బుకింగ్ జరుగుతున్నాయంటే డిమాండ్ ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు

డ్రమ్మునీళ్లు మాత్రమే వస్తున్నాయి: శ్రీదేవి

భగత్‌సింగ్‌నగర్‌లో 30ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాం. అరకొరా నీటి సరఫరాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కులాయి నుంచి నీళ్లు సన్నగా వస్తుండటం వల్ల సమస్య ఏర్పడుతుంది. కనెక్షన్ ఉన్నా.. నీటి సరఫరా లేకపోవడంపై గతంలోనే బోర్డు అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదు. 

తాగనీటికి సరిపోవడం లేదు : సునీత

మండుతున్న ఎండలతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు తాగునీటికి తీవ్ర అవస్థలు పడుతున్నాం. లో సమస్య వల్ల నీళ్లు రావడం లేదు. ఆటోవృత్తి చేసుకుంటూ జీవనం సాగించే తమకు ప్రైవేట్ వాటర్ ఫిల్టర్ నుంచి నీళ్లు కొనుక్కోవడం ఇబ్బందిగా ఉంది. డ్రమ్ము మాత్రమే నిండుతోంది. 

మోటర్లు పెట్టుకోవడంతో సమస్య

అజ్మీరా కృష్ణ, ఓఅండ్‌ఎం డైరెక్టర్

కోర్‌సిటీలో తాగునీటి సమస్య ఉన్నా విషయం తెలిసిందే. అయితే వేసవి కావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే వేసవి ప్రత్యేక కార్యాచరణతో ముందు కెళ్లుతున్నాం. క్షేత్రస్థాయిలో ప్రతి కాలనీ, బస్తీల్లో తాగునీటి సమస్యలను అధిగమించేందుకు వాటర్‌బోర్డు తీవ్రంగా శ్రమిస్తోంది. 

అత్యధికంగా డిమాండ్ అక్కడే

ట్యాంకర్స్‌కు డిమాండ్ ఏర్పడడానికి గల కారణాలను తెలుసుకోవడాని కి వాటర్‌బోర్డు ఇటీవల సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కారణమని తేలింది. ట్యాంకర్స్ బుకింగ్స్ వినియోగదారులకు నీటి సరఫరా చేసేందుకు వాటర్‌బోర్డు సిబ్బంది రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. ట్యాంకర్స్‌కు డిమాండ్ నరగమంతటా లేదని బోర్డు చెబుతోంది. పశ్చిమ ప్రాంతాలైన మణికొండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోనే అధికంగా ఏర్పడింది.

రిజర్వాయర్ల నీటినిల్వలు

జలాశయం                     అత్యధిక నీటిమట్టం            ప్రస్తుతం             కిందటి సంవత్సరం 

                                     (అడుగుల్లో)                                              ఇదే రోజు నీటిమట్టం

ఉస్మాన్‌సాగర్                        1790                                    1783                      1787

హిమాయత్‌సాగర్                1763                                    1758                      1761

నాగార్జున సాగర్                  590                                      508                        528

శ్రీపాద ఎల్లంపల్లి(గోదావరి)  485                                      464                         472


వాటర్‌బోర్డు సరఫరా చేస్తున్ననీళ్లు

జలాశయం                   సరఫరా చేస్తున్ననీరు

                                  (ఎం.ఎల్డీ) 

ఉస్మాన్‌సాగర్                   91

హిమాయత్‌సాగర్           12.32

సింగూరు, మంజీరా           460

కృష్ణా ఫేజ్‌బౌ                   1254

గోదావరి ఫేజ్                   741.45

మొత్తం                          2559.00