బాలరాముడికి సూర్యతిలకం

18-04-2024 02:30:49 AM

l అయోధ్యలో ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం 

l శిఖరం నుంచి గర్భగుడిలోకి ప్రసరించిన సూర్య కిరణాలు

l ప్రత్యేక పరికరాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు

l పులకరించిన అశేష భక్తజనం

అయోధ్య, ఏప్రిల్ 17: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామమందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై పడిన సూర్య తిలకం చూసి అశేష భక్తజనం పులకించిపోయింది. ఈ ఏడాది జనవరిలో రామమందిరం ప్రారంభించిన తర్వాత మొదటి శ్రీరామనవమి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్ష్వాకు తెగకు చెందిన శ్రీరాముడి పూర్వీకులు సూర్యభగవానుడి వంశానికి చెందినవారిగా భావిస్తారు. అందుకే ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం నిర్దిష్ట సమయానికి బాలరాముడి నుదుటిపై కొద్ది నిమిషాల పాటు సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయ నిర్మాతలు ఏర్పాట్లు చేశారు. 

ప్రత్యేక మెకానిజం..

సూర్యతిలకం మెకానిజాన్ని ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు రూపొందించారు. అత్యంత నాణ్యమైన అద్దాలు, కటకాలు, పైపులతో పరికరాన్ని తయారుచేసి ఆలయంలో అమర్చారు. గేర్ బాక్స్ ద్వారా నిర్దిష్ట సమయానికి మూడో అంతస్థులో ఉన్న శిఖరం నుంచి సూర్యకిరణాలను గ్రహించి గర్భగుడిలో ఉన్న రామ్‌లల్లా నుదుటిపై పడేట్లు ఈ వ్యవస్థను రూపొందించారు. పరికరంలోని భాగా లు ఎక్కువకాలం మన్నికగా ఉండేలా ఇత్తడి, కంచు లోహాలను ఉపయోగించారు. ప్రతి శ్రీరామనవమికి సూర్యుని స్థానాన్ని గుర్తించేందుకు చాంద్రమాన క్యాలెండర్ ఆధారం గా చేసుకున్నారు. దీని ప్రామాణికంగా ఏటా ఒకే స్థానంలో ఆటోమేటిక్‌గా సూర్యకిరణాలు పడేలా గేర్‌బాక్స్‌లో ఏర్పాట్లు చేశారు.  

వివిధ సంస్థల సహకారంతో.. 

సూర్యుడి స్థానానికి సంబంధించి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) సాంకేతిక సహకారాన్ని అందించింది. బెంగళూరుకే చెందిన ఆప్టికా అనే సంస్థ కటకాలు, ఇత్తడి పైపులను తయారు చేసింది.

ఇలాంటి సాంకేతికత దేశంలోని చాలా ఆలయాల్లో ఉన్నాయి. అందులో కొన్నింటిని పరిశీలిద్దాం.. 

సూరియానార్ కోవిల్ (తమిళనాడు): 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. సంవత్సరంలో నిర్దిష్ట సమయాల్లో బిందువుల రూపంలో సూర్యకిరణాలు ఆలయంలో విగ్రహాలపై ప్రసరించేలా నిర్మాణం జరిగింది. 

నారాయణస్వామి ఆలయం (ఏపీ): నాగులపురం మండలంలోని ఈ ఆలయంలో ఐదు రోజల పాటు సూర్యపూజ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో ప్రతి రోజు వేర్వేరు స్థానాల్లో కిరణాలు ప్రసరిస్తాయి. ఇవి గర్భగుడిలోని విష్ణు రూపమైన మత్స అవతార విగ్రహం పాదాల నుంచి నాభి వరకు వ్యాప్తి చెందుతాయి. 

మోదీ భావోద్వేగం.. 

   అయోధ్యలో రామ్‌లల్లా నుదుటిపై సూర్యతిలకం ప్రసరించే దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన ప్రధాని నరేంద్రమోదీ భావోద్వేగానికి గురయ్యారు. అసోంలో ప్రచార సభలో పాల్గొన్న ఆయన తిరుగు ప్రయాణంలో విమానంలో వెళుతూ ఈ లైవ్‌ను చూశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్నారు. ‘అసోంలోని నల్‌బడీ ఎన్నికల ప్రచారం అనంతరం బాలరాముడిపై సూర్యతిలకాన్ని వీక్షించాను. కోట్లాది భారతీయుల్లాగే నాకు ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది. అయోధ్య చరిత్రలోనే ఘనమైన రామనవమి వేడుకలు ఇవే’ అని మోదీ అన్నారు.

కోణార్క్ సూర్యదేవాలయం (ఒడిశా):   13వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఉషోదయం సమయంలో ఆలయంపై సూర్యకిరణాల అభిషేకం జరుగుతుంది. తొలి కిరణాలు ముఖద్వారం ద్వారా ప్రసరించి వివిధ మార్గాల గుండా పయనిస్తూ గర్భగుడిలోకి చేరేలా ఈ ఆలయాన్ని నిర్మించారు.