శోభాయమానం శ్రీరాముడి శోభాయాత్ర

18-04-2024 03:10:27 AM

l జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగిన పురవీధులు

l పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు

l భారీగా మొహరించిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): భాగ్యనగరంలోని పురవీధుల గుండా శ్రీరాముని శోభాయాత్ర అత్యంత శోభాయమానంగా జరిగింది. బుధవారం వీధులన్నీ కాషాయపు జెండాలతో రెపరెపలాడాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దూల్‌పేట్ సీతారాంబాగ్ ఆలయం నుంచి మొదలైన శోభాయాత్ర కోఠి హనుమాన్ వ్యాయామశాల మైదానం వరకు చేరుకొని ముగిసింది. బోయిగూడ కమాన్, జాలీ హనుమాన్, మంగళ్‌హాట్ పీఎస్ ఓడ్, పురాణాపూల్, గాంధీవిగ్రహం, ధూల్‌పేట్, చుడీబజార్, బేగంబజార్, ఛత్రి, జుమ్మేరాత్‌బజార్, బర్తన్‌బజార్, శంకర్‌షేర్ హాట్, గురుద్వారా, సిద్ధిఅంబర్ బజార్, గౌలిగూడ చమన్, పుత్లిభౌలి ఎక్స్‌రోడ్డు, సుల్తాన్‌బజార్, కోఠిల మీదుగా శ్రీరామనవమి శోభయాత్ర కనుల విందుగా సాగింది.

ఈ యాత్ర ప్రయాణంలో చిన్న చిన్న ఊరేగింపులు వివిధ పాయింట్ల వద్ద ప్రధాన ఊరేగింపుల్లో కలిశాయి. శోభాయాత్రలో రాముని విగ్రహాలతో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలు, దేశభక్తిని చాటే మహానేతల విగ్రహాలను ప్రదర్శించారు. ఈ యాత్రలో నగర ప్రజలు, యువకులు భారీగా హాజరయ్యారు. యాత్ర వెంబడి యువత జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వెయ్యిమంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.

నగర ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా యాత్ర కొనసాగే ప్రాంతాల్లో ముందస్తుగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. జంటనగరాల్లోని మద్యం దుకాణాలను  24గంటల పాటు బంద్ చేశారు. శోభాయాత్రను వీక్షించడానికి నగర ప్రజలు భారీగా తరలివచ్చారు. శోభాయాత్రకు ముఖ్య అతిథిగా శ్రీచైతన్యానంద మహారాజ్ హాజర య్యారు. కార్యక్రమంలో భాగ్యనగర శ్రీరామనవమి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ భగవంతరావు, ప్రధాన కార్యదర్శి గోవింద్‌రాఠి పాల్గొన్నారు.