కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్

18-04-2024 03:43:55 AM

l ఏడు రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్న సీఎం

l ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు..

l కేరళ, బీహార్, గుజరాత్ నుంచి ఆహ్వానం 

l యూపీలోనూ ప్రచారం చేయాలని నిర్ణయం 

l 19 నుంచి మే 11 వరకు రాష్ట్రంలో ప్రచారం 

l 50 సభలు.. 15 రోడ్డు షోలకు ప్రణాళిక 

l ఒక్కో పార్లమెంట్ పరిధిలో మూడు సభలు

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులతో జాతీయస్థాయిలో ప్రచారం చేయించేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా కీలక బాధ్యతలు అప్పగించింది. రేవంత్‌రెడ్డిని దేశవ్యాప్తం ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఏడు రాష్ట్రాల్లో ఆయనతో ప్రచారం చేయించనున్నది. ఇప్పటికే ప్రచారానికి రావాలని ఏడు రాష్ట్రాల నుంచి రేవంత్‌రెడ్డి ఆహ్వానాలు అందాయి. దీంతో ఆయన జాతీయ స్టార్ క్యాంపెయినర్‌గా సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, బీహార్, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్‌లో కూడా రేవంత్‌రెడ్డి ప్రచారం చేయనున్నారు. 

రాహుల్, కేసీ వేణుగోపాల్ సెగ్మెంట్లలోనూ 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బరిలోఉన్న అలప్పుజ నియోజకవర్గాల్లోనూ రేవంత్‌రెడ్డి ప్రచారం చేయనున్నారు. ఈ నెల 19 నుంచి మే 11 వరకు తెలంగాణలో సీఎం సుడిగాలి పర్యటన చేయనున్నారు. 50 సభలు, 15 రోడ్ షోలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రణాళిక వేసింది. మెదక్, వరంగల్, భువనగిరి, మహబూబ్‌నగర్, మహబూబాబాద్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమం సందర్భంగా నిర్వహించే ర్యాలీలు, సభలకు సీఎం హాజరుకానున్నారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో కనీసం మూడు చోట్ల సీఎం సభలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.  

రాహుల్‌గాంధీనే ప్రధాని 

కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీచేస్తున్న వయనాడ్ నియోజకవర్గంలో బుధవారం  రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఇండియా కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు. రాబోయే 20 ఏండ్లు వయనాడ్ ఎంపీయే దేశ ప్రధానిగా ఉంటారని సీఎం తెలిపారు. అవినీతికి ప్రధాని నరేంద్రమోదీ చాంపియన్ అని ఆరోపించారు. బ్యాలెంట్ పేపర్లతో ఎన్నికలంటే మోదీ భయపడుతున్నారని విమర్శించారు. ఈవీఎంలపై విపక్షాలతోపాటు ప్రజలకు కూడా నమ్మకం పోయిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పోలింగ్‌కు బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తున్నారని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు కూడా భారత్‌లో అంతర్భాగమనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం  గ్రహించాలని అన్నారు. గుజరాత్‌కు కేటాయించిన బుల్లెట్ రైలును దక్షిణాదికి కూడా ఇస్తామని ఇప్పుడెందుకు మ్యానిఫెస్టోలో పెట్టారని నిలదీశారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్ర, హోం మంత్రి, రక్షణ మంత్రి వంటి కీలక పదవులు దక్షిణాది వారిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. బీజేపీని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడో నిషేధించాయని, వయనాడ్‌లో పోటీలో ఉన్న ఎల్డీఎఫ్ అభ్యర్థికి కేరళ సీఎం పినరయి విజయన్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని నిలదీశారు. బీజేపీ అభ్యర్థి సురేంద్రన్‌కు అండగా నిలిచారని విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్స్‌ను పారదర్శకత కోసమే తెచ్చామని మోదీ చెప్తున్నారని, అదే నిజమైతే సుప్రీంకోర్టు ఈ వ్యవస్థను ఎందుకు రద్దు చేసిందని ప్రశ్నించారు. పాదర్శకత ఉంటే బీజేపీకి డబ్బులు ఇచ్చిన వారి పేర్లను ఎంపదకు బయటపెట్టడం లేదని ఆయన నిలదీశారు. ఎలక్టోరల్ బాండ్స్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకమని విమర్శించారు.

తెలంగాణలో 14 సీట్లు మావే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ కుటుంబాన్ని ఓడిస్తానని చెప్తే ఎవరూ నమ్మలేదని, కానీ తన మాటను నిజం చేసి చూపించానని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈసారి కూడా తెలంగాణలో అలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు. తెలంగాణలో 14 సీట్లు గెలిపించి చూపిస్తానని ప్రకటించారు. రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసాన్ని నింపారని కొనియాడారు. ఆయనకన్నా ప్రధానమంత్రి కాగలిగే అర్హత ఇంకెవరి ఉన్నదని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికలు వయనాడ్ వర్సెస్ వారణాసి అని పేర్కొన్నారు.