నేటి నుంచి నామినేషన్లు

18-04-2024 03:48:04 AM

l నోటిఫికేషన్ విడుదలచేయనున్న ఈసీ 

l 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ 

l మే 13న పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్

l ఓటు వేయనున్న 3 కోట్లమంది ఓటర్లు 

l మొదటి రోజే నామినేషన్లకు అభ్యర్థులు రెడీ

హైదరాబాద్, హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టం నేడు ప్రారంభం కానున్నది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజక వర్గాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. అది ఈ నెల 25 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. నాలుగో దశలో రాష్ట్రంలోని 17 స్థానాలకు మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. రోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకు మాత్రమే నామినేషన్లు 

స్వీకరిస్తారని ఈసీ వర్గాలు తెలిపాయి. 

రాష్ట్రంలో 2.95 కోట్ల మంది ఓటర్లు

రాష్ట్రంలో దాదాపు 2.95 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,48,42,582 మంది కాగా, మహిళలు 1,46,74,217 మంది. థర్డ్ జెండర్స్ 2,089 మంది ఉన్నారు. కాగా,  రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొన్నది. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ మాత్రం 14 నియోజకవర్గాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు  పూర్తయింది. గురువారం ప్రకటించే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. 

మొదటిరోజే నామినేషన్లకు మొగ్గు

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు గురువారం ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం ఉన్నది. ముఖ నక్షత్రంతో కూడిన చైత్ర శుద్ధ దశమి కావడంతో వివిధ పార్టీలకు చెందిన చాలా మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు. 18,19,21 తేదీల్లో అభ్యర్థులు ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం ఉన్నది.