30 April, 2024 | 11:45 PM

వేసవి సెలవుల్లో హైదరాబాద్ సొగసులు చూద్దామా

18-04-2024 02:57:07 AM

వరల్డ్ హెరిటేజ్ డే స్పెషల్ 

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏపిల్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్.. 500 ఏళ్ల చరిత్ర ఉన్న వారసత్వ నగరం. ఆదిమ కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మానవ జీవన పరిణామ క్రమాన్ని చెప్పే ఒక గ్రంథం. భిన్న మతాలు, విభిన్న సంస్కృతుల నిలయాలు కొలువుదీరిన ప్రాచీన పర్యాటక ప్రాంతం. నాటి బౌద్ధ స్థావరాలు, చాళుక్యుల శాసనాలు, కాకతీయుల కళాఖండాలు, నిజాం నవాబుల ప్యాలెస్‌లతో కొలువుదీరిన వారసత్వ ఖజానా మన హైదరాబాద్ మహా నగరం.

ప్రస్తుతం వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల సందర్శనకు నగర ప్రజలు సిద్ధమవుతారు. కొందరికి మాత్రం నగరం దాటి వెళ్లే పరిస్థితి ఉండదు. ఇలాంటి వాళ్లకు నగరంలోనే ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. గురువారం ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా నగరంలోని వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రదేశాల ప్రత్యేకతలను ‘విజయక్రాంతి’ అందిస్తోంది. 

హైదరాబాద్ మ్యూజియం

హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని వివరించే చిత్రాలు. ఫొటోలు, పురావస్తు ఆధారాలు, నిజాం కాలం నాటి వస్తువులు, దుస్తులు, పాత్రలు, ఆభరణాలు ఇందులో ఉన్నాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటలలోపు సందర్శించాలి. ప్రతి శుక్రవారం సెలవు రోజు. బస్సులో వెళితే పురానీహవేలిలో, ఎంఎంటీఎస్ రైల్‌లో వెళితే డబీర్‌పురాలో దిగాలి. 

చౌమహల్లా ప్యాలస్

అసఫ్ జాహీ నవాబుల రాజసానికి, మొగలాయి రాతిశిల్ప పాఠవాలకు, అపురూపమైన అందానికి ప్రతీక. మక్కా మసీదు నుంచి ఖాజీపురా వరకు 2.90 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ భవనం ఉంది. 1750లో సలాబత్ జంగ్ దీనిని నిర్మించారు. చౌమహల్లా అంటే నాలుగు మహాళ్లు అని అర్థం. 1857 మధ్య కాలంలో దీనిని ఐదో నిజాం నిర్మించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సందర్శించాలి. 

నిజాం మ్యూజియం

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు పట్టాభిషేకం జరిగి పాతికేళ్లు గడిచిన సందర్భంగా నిర్వహించిన వేడుకలలో ఆయనకు వచ్చిన కానుకలను ఇందులో భద్రపర్చారు. రోల్స్ రాయిస్, పాకార్డ్, జాగ్వార్ మోడల్ వింటేజ్ కార్లు, నిజాం బంగారు సింహాసనం, నిజాం వంశస్థుల చిత్ర పటాలు, వార్డ్ రోబ్, గోల్డెన్ టిఫిన్ బాక్సు, వజ్రాలు పొదిగిన సిల్వర్ కాఫీ కప్పులు ఇందులో ఉంటాయి. ఈ మ్యూజియం పురానీహవేలిలో ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు చూడవచ్చు.  

పురావస్తు శాఖ మ్యూజియం 

నిజాం ప్రభుత్వం పురావస్తు శాఖను ఏర్పాటు చేసిన తర్వాత ఆ శాఖ పర్యవేక్షణలో దీనిని ఏర్పాటు చేశారు. నాణెలు, ప్రాచీన ఖురాన్లు, ఫిరంగులు, కాకతీయుల శిల్పాలు, బుద్ధుని అస్థికలు, జైన శిల్పకళ, అజంత చిత్రాలు, బుద్ధగ్యాలరీ, బ్రాహ్మణీయ, జైన గ్యాలరీ, చెక్క రథాలు, కాకతీయ మందిరం, కంచువిగ్రహాలు, రాత ప్రతులు, ఆయుధాలు, రక్షణ సామాగ్రి, ఈజిప్టుకు చెందిన మమ్మీ, కరెన్సీ, పెయింటింగ్స్, బిద్రీ పాత్రలు, అలంకరణ వస్తువులు, వస్త్రాలు ఇందులో ఉంటాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు సందర్శించాలి. ఆదివారం సెలవు.

హెల్త్ మ్యూజియం 

పిండస్థ దశ నుంచి ప్రౌఢ దశ వరకు జీవి పరిణామక్రమాన్ని వివరించే నమూనాలు, శరీర నిర్మాణాన్ని వివరించేందుకు మానవ అవయవాలపై ఇందులో ప్రదర్శన ఉంటుంది. వైద్య ఆరోగ్య సబంధ విషయాలపై అవగాహన కల్పిస్తారు. ఇది పబ్లిక్ గార్డెన్‌లో ఉంటుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలలోపు చూడాలి. 

మొజాంజాహీ మార్కెట్

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1935లో దీనిని నిర్మించారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో 171 దుకాణాలుంటాయి. ఇండో అరబిక్ వాస్తు శైలిలో నిర్మించారు. ఎత్తున డోమ్‌కు గడియారాలు ఉంటాయి. నగరంలోని పూల, పండ్ల తోటల ఉత్పత్తులను ఇక్కడ విక్రయించేవారు. నగర వ్యాపారాభివృద్దిలో ఈ మార్కెట్‌ది కీలక భూమిక. కేసీఆర్ ప్రభుత్వం దీనిని ఆధునికీకరించింది. 

కుతుబ్ షాహీ సమాధులు 

గోల్కొండ కోటకు దగ్గరలోని ఇబ్రహీంబాగ్‌లో కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఏడుగురు సుల్తాన్ల సమాధులు ఉన్నాయి. 1518 మధ్య వీటిని నిర్మించారు. చతురస్రాకారపు బేస్‌మెంట్‌పై అరబిక్, ఇండో, పైతాన్ శైలిలో వీటిని నిర్మించారు. అందమైన గోడలు, అపురూపమైన డోమ్‌లు, చూడచక్కని నగషీలు ఈ టూంబ్స్‌కు అదనపు కీర్తిని తెచ్చిపెట్టాయి. లోపల ఇరానీ టైల్స్ అమర్చారు. 

పురానాపూల్ 

భాగ్యనగరం పేరు తలుచుకుంటే గుర్తుకు వచ్చే ప్రేమికులు భాగమతి, మహ్మద్ కులీకుతుబ్ షా. వాళ్ల ప్రేమ ఫలమే నేటి పురానాపూల్. నగరంలో నిర్మితమైన తొలి వంతెన ఇది. గోల్కొండలో ఉండే కులీకుతుబ్ షా చంచలంలో భాగమతిని కలిసేందుకు వెళ్లినప్పుడు అతికష్టంగా మూసీని దాటేవారు. అది చూసిన సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా తన కుమారుడి కోసం 1573లో ఆ వంతెనను నిర్మించారు. 

యునానీ దవాఖాన

చార్మినార్‌కు ఆగ్నేయ మూలన ఇండో శైలిలో యునానీ దవాఖాన నిర్మించారు. 1908లో మూసీ నది వరదలు వచ్చి పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అప్పుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నగరాన్ని పునర్నిర్మించారు. అందులో భాగంగా రూ.5లక్షల వ్యయంతో నిర్మించిన ఆసుపత్రిని 1938లో ప్రారంభించారు. 

ఉస్మానియా యూనివర్సిటీ 

1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అంతకుముందు అబిడ్స్‌లో ఉండేది. దీని కోసం నల్లకుంట ప్రాంతంలో 1,600 ఎకరాల భూమిని కేటాయించారు. బెల్జియం దేశానికి చెందిన ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ఇచ్చారు. 1934లో శంకుస్థాపన చేశారు. ఇండో అరబిక్ యూరోపియన్ వాస్తు రీతులన్నింటినీ మిళితం చేసి ఈ భవనాన్ని నిర్మించారు. 

సికింద్రాబాద్ క్లాక్ టవర్ 

బ్రటీషు కంటోన్మెంట్ ప్రగతికి చిహ్నంగా 1860లో సికింద్రాబాద్ క్లాక్ టవర్‌ను నిర్మించారు. అలాగే సుల్తాన్ బజార్ 1865లోనూ అంగ్లేయులే కట్టించారు. అలాగే నగరంలో మహబూబ్ చౌక్ (1852లో), ఫతేమైదాన్‌లో 1903లో నిజాం, జేమ్స్ స్ట్రీట్‌లో 1900లో రాంగోపాల్ సేఠ్ క్లాక్ టవర్లను నిర్మించారు. 

కింగ్ కోఠి ప్యాలెస్ 

1911లో కమల్ ఖాన్ అనే వ్యాపారి దీనిని నిర్మించారు. ఇందులోని కిటికీలు, తులుపులపై కమల్ ఖాన్ పేరును సంక్షిప్తంగా కేకే అని ఆంగ్ల అక్షరాలతో ఉన్నాయి. వీటిని చూసి నిజాం కింగ్ కోఠిగా మార్చారు. ఆ విధంగా కింగ్ కోఠిగా స్థిరపడింది. 

జూబ్లీహాల్ 

నిజాం రాజు దర్బార్ ఇది. ఏడో నిజాం పబ్లిక్ గార్డెన్‌లో దీనిని నిర్మించారు. దీని స్థానంలో ఓ దర్బార్ ఉండేది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బాధ్యతలు చేపట్టి పాతికేళ్లు అయిన నేపథ్యంలో 1913లో జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఏడో నిజాం పాలన ముగిసే వరకు ఇందులో దర్బార్ నిర్వహించేవారు. 

హుస్సేన్ సాగర్ 

మానవ నిర్మిత సరస్సు. నగర ప్రజల తాగు, సాగు నీటి అవసరాల కోసం 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా దీనిని నిర్మించారు. దీని నిర్మాణ పనులను కులీ కుతుబ్ షా అల్లుడు హజ్రత్ హుస్సేన్ షావలీ పర్యవేక్షించారు. అందుకే దీనికి హుస్సేన్ సాగర్ అనే పేరు వచ్చింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 32 అడుగుల లోతులో నిర్మించారు. 1992లో మోనోలిథిక్ గౌతమ బుద్ధ విగ్రహం ఏర్పాటు చేశారు.  

ప్రత్యేక రాష్ట్రంలో...

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని, అమెరికా వైట్ హౌస్ నమూనాలో డా.బి.ఆర్.ఆంబేడ్కర్ తెలంగాణ సచివాలయాన్ని, తెలంగాణ అమరుల జ్ఞాపకార్థం అమరవీరుల స్మతిచిహాన్ని నిర్మించారు. అలాగే దుర్గం చెరువుపై తీగల వంతెనను సుందరంగా నిర్మించారు. ఇవి నిత్యం సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ఇలా నగరంలో ఉన్న అనేక చారిత్రక అందాలను చిన్నారులకు చూపించడం వలన వాళ్లకు ఆహ్లాదంతో పాటు విజ్ఞానం పెరిగే అవకాశం ఉంటుంది.  

అసెంబ్లీ 

నగరంలోని సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏడవ ని జాం నిర్మించారు. ప్రభుత్వం నిర్వహించే విందులు, వినోదాలతో పాటు నగరంలోని ప్రముఖులు, సామాన్యులు కూడా ఇందులో సాంస్కృతిక, ఇతర వేడుకలను నిర్వహించేవారు. దీని నిర్మాణం కోసం నగరంలోని రాంగోపాల్ సేఠ్, ఇతర జాగీర్ధార్లు  చందాలిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దీనిలో అసెంబ్లీ సమావేశాల కోసం ఉపయోగిస్తున్నారు. 

గోల్కొండ కోట 

గోల్కొండ కోటలో సింహాద్వారం, వంతెనలు, రాజ మందిరాలు, మసీదులు, అశ్వశాలలు, బాలాహిస్సారు దర్వాజ, మాదన్న దేవాలయం, తారామతి మసీదు, తారామతి  బరాదరి, రామదాసు రామాలయం ఉంటాయి. ఉదయం  10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు సందర్శించాలి. మెహిదిపట్నం మీదుగా వెళ్లి గోల్కొండ బస్ స్టాండ్‌లో దిగాలి. 

చార్మినార్

హైదరాబాద్ అంటే మొదట గుర్తుకు వచ్చేది చార్మినార్. 16 శతాబ్దంలో ప్లేగు వ్యాధిపై విజయానికి గుర్తు మహ్మద్ కులీ కుతుబ్‌షా 1591 మధ్య కాలంలో దీన్ని నిర్మించారు. కుతుబ్ షాహీల నిర్మాణ శైలికి చార్మినార్ మచ్చుతునగా చెప్పవచ్చును. 48.7 మీటర్ల ఎత్తులో నాలుగు మినార్లు సందర్శకులను కనువిందు చేస్తాయి. ఈ నిర్మాణాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు సందర్శించవచ్చు. చిన్నారులకు ఉచితం. నగరం నలుదిక్కుల నుంచి బస్సు సౌకర్యం ఉంది. ఎంఎంటీఎస్‌లో వెళ్లాలనుకుంటే యాకుత్‌పురా స్టేషన్‌లో దిగాలి. 

సాలార్‌జంగ్ మ్యూజియం

ప్రపంచవ్యాప్తంగా సేకరించిన ఎన్నో వస్తువులు, ఆయుధాలు, విగ్రహాలు, కళాఖండాలు ఇందులో ప్రదర్శిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సందర్శన వేళలు. ఫీజు ఉంటుంది. ప్రతి శుక్రవారం, జాతీయ పండుల సమయంలో సెలవు ఉంటుంది. రైలు మార్గంలో వెళితే మాత్రం డబీర్‌పురాలో దిగాలి. 

బిర్లా సైన్స్ మ్యూజియం

శాస్త్రీయమైన ఆలోచనలు రూపొందించేందుకు సైన్స్ సిద్ధాంతాలను ప్రాచుర్యం కల్పించేందుకు ఈ మ్యూజియాన్ని నిర్వహిస్తున్నారు. జీవ పరిణామ క్రమాన్ని తెలిపే ప్రదర్శనలు, శిలాజాలు, అంతరిక్ష రహస్యాలు కళ్లకు కట్టే ప్లానిటోరియం ప్రదర్శన పిల్లలకు విజ్ఞానదాయకంగా ఉంటుంది. నౌబత్ పహాడ్‌లో ఉంటుంది. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంటుంది. 

మక్కా మసీదు

దీనిని 1617లో మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మాణాన్ని ప్రారంభించగా.. మీర్ ఫజులుల్లా బేగ్, రంగయ్య చౌదరి నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించారు. తానీషా పాలన వరకు దీని నిర్మాణం కొనసాగింది. తర్వాత నిలిచిపోయింది. కానీ 1694లో ఔరంగాజేబు ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుమారు 77 ఏళ్లు నిర్మించారు. దీని నిర్మాణంలో మక్కా నుంచి తెచ్చిన రాయిని ఉపయోగించారు. అందుకే దీనిని మక్కా మసీదు అంటారు. ఈ మసీదులో మహ్మద్ ప్రవక్త కేశం (వెంట్రుక), అసఫ్ జాహీల సమాధులు ఉన్నాయి.