ఇది ప్రజల పత్రిక

18-04-2024 03:50:39 AM

తెలంగాణకు వందనం

కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ ఇప్పుడు చౌరస్తాలో నిలబడి ఉన్నది. కలబడి తెచ్చుకున్న తెలంగాణ తిరిగి తిరిగి చౌరస్తా చేరింది. ఇప్పుడు తెలంగాణ గతాన్ని మరోసారి గుర్తెరిగి సరైన పంథాలో ప్రజలే నడిపించుకోవాల్సిన పరిస్థితి. నీళ్లు, నిధులు, నియామకాలను సరైన రీతిలో దీర్ఘకాల ప్రయోజనాలను కల్పించే మార్గంలో పెట్టుకోవాల్సి ఉన్నది. ఈ బాటలో సరైన దృష్టిగల రాజకీయం తెలంగాణలో  వర్థిల్లాలి. 

పదేళ్ల కాలంలో తెలంగాణ ఎన్నో ఉత్థానపతనాలను చవిచూసింది. రాబడులను మించిన ఖర్చుతో, ఆర్థిక పరిస్థితి మేడిపండు చందంగా మారింది. పథకాల పరుగులో మోయలేని భారాన్ని ప్రజల నెత్తికెక్కించిన పరిస్థితి. సమైక్య పాలనలో కునారిల్లిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే రైతులు, కార్మికులు, యువతలో ఇంకా నైరాశ్యం గూడుకట్టుకొనే ఉంది. నీళ్లు అడుగంటి కాలువలు నెర్రెలువారగా రాష్ట్రంలో అధిక శాతం రైతులు అల్లాడుతున్నారు. పండించిన పంటలకు సరైన గిట్టుబాటు అనేది ఎప్పుడూ ప్రశ్నార్థకమే. 

మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యో గాన్వేషణలో ఉన్న యువత బాధ వర్ణనాతీతం. ప్రభుత్వ కొలువుల విషయంలో ఇంకా గడబిడ కొనసాగుతూనే ఉంది. ఇక అన్ని రంగాల్లో మహిళల అభ్యున్నతి ముందుపడాల్సే ఉంది. వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసీల కోసం అమలవుతున్న పథకాలు ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’గా మారాయి. విద్య, వైద్యం, గృహకల్పన కోసం వెచ్చిస్తున్న నిధులు అరకొరే. మరోవైపు జీవనోపాధి కోసం అనునిత్యం తపిస్తున్న లక్షలాది పేదల జీవన ప్రమాణాల్లో పెద్ద మార్పేమీ లేదు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాగే వారి బతుకులున్నాయి. 

 ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల కథలు, గాథలు, కన్నీళ్లు, సంతోషాల కలబోతకు ఒక మంచి వేదిక కావాలి.  తెలంగాణ ప్రజలకు ఇప్పుడు తమదైన ఒక గొంతుక కావాలి. ఆ వేదిక, గొంతుక ‘విజయక్రాంతి’ దినపత్రిక. ఇది ప్రజల పత్రిక. వర్తమాన ముద్రణా జర్నలిజానికి భిన్నంగా అనేక అంశాలలో ప్రత్యేక శైలిలో 

‘విజయక్రాంతి’ మీకు వార్తలు అందిస్తుంది. ప్రజలకు ఎప్పుడు, ఎలాంటి వార్తలు అవసరమో, ఎటువంటి సమాచారం ఎంతమేర ప్రజలకు చేరాలో అటువంటి వార్తలు, సమాచారాన్ని ‘విజయక్రాంతి’ వేకువ జామునే మీ చేతుల్లో పెడుతుంది. ప్రత్యేక కథనాలతో, కంటికింపైన లే అవుట్‌తో ఇకపై ప్రతి రోజూ మీ ముందుకు వస్తుంది. అనుభవజ్ఞులైన సీనియర్ జర్నలిస్టులతో విలువలు కలిగిన వార్తాంశాలతో వెలువడుతున్న ‘విజయక్రాంతి’ పూర్తిగా ప్రజల పక్షాన నిలబడుతుందని మీకు మాట ఇస్తున్నాను.

తెలంగాణ సమాజంలో నిత్యం జరుగుతున్న వ్యవహారాలు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఉన్నది ఉన్నట్లు మీకు చెప్పడంలో ‘విజయక్రాంతి’ దర్పణంలా పని చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘విజయక్రాంతి’ మీ అందరి తరఫునా ప్రభుత్వంతో మాట్లాడుతుంది. 

ఆశీర్వదించండి...

సీఎల్ రాజం,

చైర్మన్