ఇందిరమ్మ ఇండ్లు లేనట్టే

18-04-2024 03:45:04 AM

l కాంగ్రెస్ ఎన్నికల హామీ అమలు కష్టమే

l వరుస ఎన్నికలు, నిబంధనలే అడ్డంకి

l ఈ ఏడు 4 లక్షలు నిర్మించాలని లక్ష్యం  

l లక్ష ఇండ్లకు కూడా సరిపోని బడ్జెట్

l కేంద్ర నిధుల కోసం సర్కారు ఎదురుచూపు

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో సొంత స్థలం లేని నిరుపేదలకు ఇందిరమ్మ గృహ వసతి ఇప్పట్లో అందే సూచనలు కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ 10 రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు జూన్ మొదటి వారంలో ముగుస్తాయి. అప్పటివరకు ఈ పథకం అమలు కుదరదు. జూన్ తర్వాత ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. దీనికి తోడు ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా మరింత జాప్యం జరిగేలా చేస్తున్నాయి. రెవెన్యూ పరమైన అంశాల జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం అవసరమైన పట్టాల పంపిణీ జరిగేలా కనిపించడం లేదు.

ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే ఖచ్చితంగా సొంత జాగా ఉండాలని ఉత్తర్వులో ఉన్నది. సొంత స్థలాలు లేనివారికి ప్రస్తుతానికి ఇండ్లమంజూరు లేదనే సంకేతాలను ప్రభుత్వం ఇచ్చింది. ఇటీవల నిర్వహించిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. గతంలో ప్రభుత్వం నుంచి ఇండ్లు పొందనివారు 66 లక్షల మంది ఉన్నట్టు ప్రాథమికంగా తేల్చింది. వీరిలో 30 లక్షల మందికి సొంత జాగా లేదని తేలింది. వారందరికీ ప్రభుత్వం మొదట భూమి పట్టాలు జారీచేసి.. ఆ తర్వాత ఇండ్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారం సొంత స్థలాలు లేనివారు మరో విడత కోసం ఎచురు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా లక్ష ఇండ్లకు మించి పూర్తికావని ప్రభుత్వం అంచనా వేసినట్టు తెలిసింది. దీంతో మొదట లక్ష ఇండ్లకు సరిపడా నిధులను సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. లక్ష ఇండ్లకు రూ.5 వేల కోట్లు కావాల్సి ఉంటుంది.

హడ్కో నిధుల కోసం గతంలోనే ప్రభుత్వం దరఖాస్తు చేయగా ప్రస్తుతం రూ.3 వేల కోట్లు మాత్రమే రుణం మంజూరయ్యాయి. వీటిలో రూ.1500 కోట్లు మాత్రమే విడుదల కానున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మొదటి విడతలో రూ.1000 కోట్లు విడుదల అవుతాయని ప్రభుత్వం అంచనా లెక్కలు వేస్తున్నది. మిగతా మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ లెక్కన లక్ష ఇండ్లకు మాత్రమే నిధులు సిద్ధంగా ఉన్నట్టు.

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం చిన్న గ్రామాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. తక్కువ జనాభా ఉండే ప్రాంతాలను గుర్తించి వాటిలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నారు. అక్కడ తక్కువ ఇండ్లే అందించినా గ్రామ జనాభా, మంజూరు చేసిన ఇండ్ల దామాషాను చూస్తే ఎక్కువ శాతం కేటాయించినట్టు లెక్కలు కనిపిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇవ్వాలనిప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.