30 April, 2024 | 11:56 PM

చరిత్రలోనే గొప్ప ఉద్యమం 1969

18-04-2024 12:10:00 AM

ప్రజలందరి ఉమ్మడి పోరాటాల ఫలితంగా, అమరుల బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.  తెలంగాణ ఉద్యమ మార్గం సుదీర్ఘమైంది. అది ఎంతో వేదనా భరితమైంది.  మేధావులు, రాజకీయ నాయకుల దృష్టినే కాకుండా తెలంగాణలోని మధ్యతరగతి దృష్టిని కూడా ఆకర్షించింది.  ఈ ప్రాంతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ ప్రాంతంలోని ఆర్థికంగా వెనకబడిన యువత కారణంగా అనతికాలంలోనే ప్రజా  ఉద్యమంగా ఎదిగింది. దేశంలోని రాజకీయ ఆవరణంలో తన ప్రత్యేక అస్తిత్వం కోసం తెలంగాణ ఉద్యమం ఆటంకాలను, కష్టాలను అధిగమించి విస్తరించింది.  దేశంలోనే బలంగా, గొప్పగా జరిగిన ఉద్యమం ఏదైనా ఉందంటే అది 1969 ఉద్యమం అనే చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఉద్యమానికి సంబంధించిన కీలకమైన అంశాలను తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విజయక్రాంతితో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..

1969 ఉద్యమంగా మనం చెప్పుకునే తెలంగాణ ఉద్యమం వాస్తవానికి 1968లోనే ప్రారంభమైంది. దానికి 1968లోనే బీజాలు పడ్డాయి. ఉద్యమం తలెత్తడానికి ప్రధానమైన కారణం ఏదంటే  పాల్వంచ దగ్గర నిర్మాణమైన కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో ఉద్యోగాలన్నీ ప్రాంతేతరులకు ఇచ్చారు. ముల్కీ నిబంధనల ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలి కదా అని వీళ్లు అడగటం ప్రారంభించారు. ఆ డిమాండ్ సాధన కోసం ఆందోళనలు కూడా చేశారు. ఒక సందర్భంలో నాన్ లోకల్స్ ఇక్కడి వాళ్ళ మీద దాడి  కూడా చేసిండ్రు. కొట్టిండ్రు.. అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా పోరాటాన్ని కొనసాగించి చివరికి తమ డిమాండ్లను సాధించుకున్నారు.

అయితే దానికంటే ముందు జరిగిన కొన్ని పరిణామాలు దీనికి కారణం అనుకోవచ్చు. ఆంధ్రాతో తెలంగాణ విలీనం అనేది కొన్ని షరతులకు లోబడి జరిగింది. ఆ షరతులన్నీంటిని పెద్ద మనుషుల ఒప్పందం రూపంలో రాసుకున్నారు. ఆ షరతులు అమలు కావడం లేదనే విషయంపై 1958 నుంచి అడపాదడపా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో భాగంగా  రీజినల్ కమిటీ ఏర్పడింది. ఆ రీజినల్ కమిటీ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తించడమే కాకుండా ఆ విషయాలను లేవనెత్తడం జరిగింది. బయట కూడా చాలామంది మేధావులు దాని మీద చర్చలు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు సమర్పించారు. రీజినల్ కమిటి సభ్యులు కూడా ఒక దశలో విసుగెత్తి, విద్యార్థులను పిలిచి వాస్తవాలన్నీ చెప్పారు. వాస్తవాలు బయటికి రావడంతో ఆందోళనలు మొదలయ్యాయి.

ప్రత్యేకంగా కొత్తగూడెం పాల్వంచలో ఈ ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంది. తెలంగాణకు దక్కాల్సిన హక్కుల గురించి ప్రత్యేకించి ముల్కీ నిబంధనల గురించి చెప్పడం మొదలు పెట్టారు. అలా వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రత్యేకించి యూనివర్సిటీలో హక్కుల సాధన కోసం ర్యాలీలు తీయడం, నిరాహార దీక్షలు చేయడం ప్రారంభించిండ్రు. అట్ల 1968లోనే ఉద్యమంగానే ఇది ప్రారంభం అయింది. ఇది చరిత్రలోనే పెద్ద, గొప్ప ఉద్యమంగా చెప్పుకోవచ్చు.

ముల్కీ నియమాలు!

ముల్కీ నియమాలు అనేవి తెలంగాణలో స్థానిక అస్థిత్వం కోసం ఏర్పడిన ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఢిల్లీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని అక్రమణ చేసిన తర్వాత తమకు సంబంధించిన అనుచరులకే ఇక్కడ  పాలన బాధ్యతలు అప్పజెప్పి పోయారు. అలా వలస వచ్చిన వాళ్ళను అఫాకీలు అనేవారు. ఈ అఫాకీల సంఖ్య క్రమక్రమంగా పెరిగి అధిపత్యం పాలన యంత్రంగా పైన పడింది. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్లే పాలన యంత్రాంగంలో ఉంటే  మరి ఇక్కడి వాళ్ల పరిస్థితేంటి అని స్థానికులు అంటే ముల్కీలు నిరసన వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. మా అస్థిత్వం, మా సంస్కృతి మంట కలిసిపోతాయి. మమ్మల్ని మేం కాపాడుకోవాలని అనుకున్నప్పుడు మాకు పాలన యంత్రాంగంలో బాధ్యత కావాలి.

మా సంగతులు తెలిసిన వాళ్లే మమ్మల్ని పరిపాలించాలే తప్ప ఈ ప్రాంతం భాష, సంస్కృతులు తెలియని వాళ్లు ఇక్కడ పెత్తనం చెలాయిస్తే ప్రజలకు నష్టం జరుగుతదని వాళ్లు ప్రశ్నించారు. తమకు ప్రాతినిధ్యం కావాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ స్థానికులకు ప్రాతినిధ్యం ఇవ్వాలని, అవసరం అయితే వాళ్లకు చదువు నేర్పించి అయినా ఉద్యోగాల్లోకి తీసుకొవాలని అనుకున్నారు. అట్ల 1880 నాటికి ఆ నిర్ణయం జరిగింది. ఇక్కడి వాళ్లకు చదువు నేర్పించి, కనీసం దిగువ స్థాయి ఉద్యోగాలకు తీసుకోవడం మొదలైంది.  చివరికి అది 1919 తర్వాత ఒక నియమంగా మారింది. అంటే ముల్కీ రూల్స్ ఏర్పాటు చేశారు.  అట్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాల్లో భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో, స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చిన నియమాలను ముల్కీ రూల్స్ అంటారు.

1948 పోలీసు యాక్షన్, హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయిన తర్వాత చాలామంది ఆంధ్రా ప్రాంతం వాళ్లను ఇక్కడికి తీసుకొస్తే వాళ్లు ఇక్కడి ప్రజల పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించారు. ఇక్కడి సంస్కృతిని ఈసడించుకున్నారు. భాషను అవమానపరిచారు. ఇక్కడి ఆస్తులను వొదిలిపెట్టి పాకిస్తాన్‌కు వలస వెళ్లిన ముస్లింల ఆస్తులను కైవసం చేసుకున్నారు.  ఆంధ్రాలో విలీనం అయితే ముల్కీ రూల్స్ అమలు కావు.. మనం నష్టపోతం, మన స్థానిక అస్థిత్వం దెబ్బతింటది అనే భయాందోళనలు  చాలా బలంగా  వ్యక్తం అయ్యాయి. ఆ భయాందోళనను వ్యక్తం చేయడమే కాదు స్థానికులు వాళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. అలా 1952లో ముల్కీ ఉద్యమం వచ్చింది.

తెలంగాణపై ఉద్యమ ప్రభావం

1969 రాజకీయాలు మలిదశ తెలంగాణ ఉద్యమంపై ప్రభావం చూపింది అనడానికి ఏం లేదు. ఇప్పుడు మలిదశ ఉద్యమం వచ్చేసరికి ఏమైందంటే కాంగ్రెస్ రాజకీయలు మాత్రమే కాక అప్పటికీ టీడీపీ, ఇతర వామపక్షాలు, తర్వాత సీపీఎం లాంటి పార్టీలు కూడా తమ అభిప్రాయాలు మార్చుకోవడం, బయట చాలా రాజకీయ పక్షాలు ఏర్పడటం, చివరకు టీఆర్‌ఎస్ కూడా ఏర్పడింది. తొలి దశలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బలంగా ఉండేది. మలిదశ ఉద్యమం నాటికి ఏమైదంటే రాజకీయంగా ఒక వైవిధ్యత అనేది వచ్చేసింది. ఈ వైవిధ్యత కారణంగా ఉద్యమాల వ్యక్తికరణకు ఒక అవకాశం లభించింది.

అది చాలా కీలకమైనటువంటి అంశం. అది ఒక మార్పుగా మనం తప్పకుండా అంగీకరించాల్సిందే. మలిదశ ఉద్యమం జరిగినా నాటికి రాజకీయంగా ఒక ప్రయత్నం బలంగా కనపడుతుంది. ప్రాంతీయ పార్టీల్లో కూడా రాజకీయంగా కొంత స్థానం పెరిగింది. వీటి అన్నింటి వల్ల తెలంగాణ ఉద్యమ రాజకీయాల వ్యక్తీకరణకు ప్రత్యమ్నాయ వేదికలు కూడా పెరిగాయి. ఇది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అట్ల తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం విజయవంతం అయింది.

1969 ఉద్యమ విశ్లేషణ అవసరం!

1969 ఉద్యమం ఎందుకు విఫలమైంది అనేది చెప్పడానికి దానిపైన ఎవరు కూడా ఇప్పటివరకు విశ్లేషణ చేయలేదు. 1969 ఉద్యమం మీద జరిగినన్ని అధ్యయనాలు ఏ ఉద్యమం మీద కూడా జరగలేదు. ఆశ్చర్యం అనిపిస్తది. యూరోపియన్లు కానీ, ఇక్కడి వాళ్లు కానీ చాలానే ప్రాంతీయ అస్థిత్వం గురించి రాశారు. కానీ వాస్తవానికి జరిగిందేందంటే ఎవరూ కూడా దానికున్న సామాజిక మూలాలను, లోతుగా విశ్లేషించలేదు. ఘర్షణ తలెత్తడానికి దారి తీసినా సామాజిక, ఆర్థిక పరిస్థితులను విశ్లేషించలేదు. అదొక భాగం. ఇక రెండో భాగమేదంటే ఈ ఉద్యమం ఎందుకు విఫలమైందని కూడా ఎవరూ చూడలేదు.  కేవలం స్వార్థపర రాజకీయ నాయకులు తమ అవసరాలు తీర్చుకోవడానికి ఉద్యమాన్ని నడిపారు అనేది ఆ రచనల సారాంశం. మలిదశ ఉద్యమం సమయంలో మనం వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆ వైఫల్యాలను విశ్లేషించుకోవడం మొదలు పెట్టాం.

అప్పటి ఉద్యమం బలమైనది. ఒక్క ఆఖరి పేజీ మాత్రమే నాయకులు చేసిన తప్పిదాల కారణంగా ఆఖరి దశలో దెబ్బతిన్నది లేకపోతే చాలా గొప్ప ఉద్యమం. మూడోది ఏదంటే ఇందిరా గాంధీ జాతీయ స్థాయిలో చాలా బలంగా ఉంది. తెలంగాణ రాజకీయం ఇక మనవళ్ల కాదు. మనం తట్టుకోలేం అనే నిర్ణయానికి వచ్చారు. ఇది కేంద్రానికి ఒక సమస్యగా మారింది. ఇప్పటి మాదిరిగా పౌర వేదికలన్నీ స్వతంత్య్రంగా ఉద్యమాన్ని నడిపి ఉంటే బహుశా ఈ ఒత్తిళ్ల నుంచి ఈ రకమైనటువంటి రాజకీయ లొంగుబాటు నుంచి ఉద్యమాన్ని కాపాడుకునే అవకాశం ఉండేదేమో కానీ అట్లాంటి ప్రయత్నం ఏది అప్పుడు సాధ్యపడలేదు. అది అప్పుడు అంత వేడిగా లేదు. బలంగా పౌర ఉద్యమ ప్రసంగాలు లేవు. ఇంకొక ప్రధాన కారణం అప్పటికీ ప్రజలు ఒక బలమైన, స్వాతంత్య్రమైన రాజకీయ శక్తిగా లేరు. కాబట్టి వీటన్నింటి కారణంగా అప్పటి ఉద్యమం నిలబడలేకపోయింది.

 రూప