బట్లర్ బొంబాట్

17-04-2024 12:53:03 AM

శివాలెత్తిన జోస్ బట్లర్ 

 కోల్‌కతాపై అజేయ శతకం

రఫ్ఫాడించిన రాజస్థాన్ 

నరైన్ సెంచరీ వృథా

ఐపీఎల్లో పరుగుల ప్రవాహం కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో హైదరబాద్ రికార్డు స్కోరు చేస్తే.. ఛేదనలో దాదాపు దగ్గరకి వచ్చిన బెంగళూరు తమ పోరాటంతో ఆకట్టుకుంది. ఇక పాయింట్ల పట్టికలో టాప్ ఉన్న జట్ల మధ్య జరిగిన పోరైతే అరాచకానికి అర్థం మార్చింది. సునీల్ నరైన్ వీరబాదుడుతో కోల్‌కతా భారీ స్కోరు చేస్తే.. బట్లర్ ఒంటి చేతి మెరుపులతో రాజస్థాన్ టార్గెట్ చేజ్ చేసింది. అడ్డూ అదుపూ లేకుండా ఎడాపెడా షాట్లు కొట్టి వేగంగా పరుగులు సాధిస్తాడని గుర్తింపు తెచ్చుకున్న కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్.. క్రీజులో కుదురుకుంటే ఎంత ప్రమాదకారో ప్రపంచానికి చాటితే.. అంతకుమించి అన్నట్లు బట్లర్ శివాలెత్తాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సహచరుల నుంచి సహకారం కరువైన సమయంలో తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని వెలికితీసి సీజన్‌లో రెండో సెంచరీ తన పేరిట లిఖించుకున్నాడు. ఫలితంగా పాయింట్ల పట్టికలో రాజస్థాన్ తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. 

కోల్‌కతాః ఐపీఎల్ -17వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విజయాన్నిఅందుకుంది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో (కేకేఆర్) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 2 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 224 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆఖరి బంతికి లక్ష్యాన్ని అందుకుంది. జాస్ బట్లర్ (60 బంతుల్లో 107 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగి ఒంటిచేత్తో రాజస్తాన్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. రియాన్ పరాగ్ (14 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతావాళ్లు విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, హర్షిత్ రాణాలు రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ (56 బంతుల్లో 109; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. అంగ్‌క్రిష్ రఘువంశీ (18 బంతుల్లో 30; 5 ఫోర్లు).. ఆఖర్లో రింకూ సింగ్ (9 బంతుల్లో 20; 1 ఫోర్ , 2 సిక్సర్లు) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీతో రాజస్థాన్‌ను గెలిపించిన బట్లర్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. లీగ్‌లో భాగంగా బుధవారం గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

నరైన్ విధ్వంసం..

కోల్‌కతా ఇన్నింగ్స్‌లో నరైన్ ఆటే హైలైట్. ఏదో నాలుగు షాట్లు ఆడుతాడని టాపార్డర్‌లో పంపితే.. పక్కా ప్రొఫెషనల్ బ్యాటర్‌లా రాజస్థాన్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. లెంగ్త్ బాల్ పడితే సిక్సర్.. లైన్ బాల్ పడితే బౌండ్రీ అన్నట్లు సాగింది అతడి విధ్వంసం. అవతలి ఎండ్ నుంచి సరైన సహకారం లభించకున్నా.. నరైన్ మాత్రం జోరు తగ్గించలేదు. యువ బ్యాటర్ రఘవంశీ అండతో రెచ్చిపోయాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (11), డేంజర్ మ్యాన్ రసెల్ (13), వెంకటేశ్ అయ్యర్ (8) విఫలమయ్యారు.  చహల్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో నరైన్ తన విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఆ ఓవర్‌లో 6,4,6,4 బాదిన నరైన్ 49 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఐపీఎల్లో నరైన్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. చివరకు బౌల్ట్ యార్కర్‌కు నరైన్ బౌల్డ్ గా వెనుదిరగడంతో అతని సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆఖర్లో రింకూ సింగ్ ఒక ఫోర్, రెండు సిక్సర్లతో కోల్‌కతా ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 

అతనొక్కడే

224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 19 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్ వైభవ్ అరోరా బౌలింగ్‌లో వెనుదిరగడంతో రాజస్తాన్ 22 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు మాత్రమే చేసిన శాంసన్.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో వెనుదిరగడంతో రాజస్తాన్ 47 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో బట్లర్‌కు రియాన్ పరాగ్ జత కలిశాడు. ఈ ఇద్దరు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడడంతో పవర్ ప్లే ముగిసేసరికి రాయల్స్ రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. అయితే పవర్ ప్లే అనంతరం రాజస్తాన్ ఇన్నింగ్స్ కుదేలయ్యింది.  కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ధ్రువ్ జురేల్ (2), అశ్విన్ (8) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా.. హెట్‌మైర్ గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. కానీ చివర్లో బట్లర్ సంచలన ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. హర్షిత్ రాణా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బట్లర్ 6,4,6 బాదడంతో పాటు మొత్తంగా ఆ ఓవర్లో 19 పరుగులు పిండుకోవడంతో ఆఖరి ఓవర్లో రాజస్థాన్‌కు ఆరు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. వరుణ్ ఆఖరి ఓవర్ వేయగా.. తొలి బంతినే సిక్సర్ బాదిన బట్లర్ 55 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అనంతరం చివరి బంతికి సింగిల్ తీసి రాయల్స్‌కు విజయాన్ని అందించాడు.

సంక్షిప్త స్కోర్లు

కోల్‌కతా: 223/6 (నరైన్ 109, 

రఘువంశి 30; అవేశ్ 2/35, 

కుల్దీప్ 2/46), రాజస్థాన్: 20 ఓవర్లలో

 224/8 (బట్లర్ 107 నాటౌట్, 

పరాగ్ 34; నరైన్ 2/30, 

వరుణ్ 2/36).