30 April, 2024 | 11:24 PM

బస్తర్‌లో బందూక్ గర్జన

17-04-2024 12:36:13 AM

29 మంది నక్సల్స్ మృతి

కాంకేర్, ఏప్రిల్ 16: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ దండకారణ్యంలో మరోసారి రక్తపుటేరులు పారాయి. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మంగళవారం మధ్యా హ్నం జరిగిన ఎదురు కాల్పుల్లో ఏకంగా 29 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యులు, మావోయిస్టు పార్టీ అగ్రనేతలైన శంకర్‌రావు, లలిత కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకొన్నట్టు బస్తర్ ప్రాంత ఐజీ సుందర్‌రాజ్ ప్రకటించారు. 

పక్కా సమాచారంతో

బస్తర్‌లో భాగమైన కాంకేర్ జిల్లాలోని బినాగుండా గ్రామ సమీపంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్టు పోలీసులకు మూడు రోజుల క్రితమే సమాచారం అందింది. ఈ ప్రాంతం మావోయిస్టులకు వ్యూహాత్మకమైన ట్రై జంక్షన్‌లో ఉంటుంది. ఉత్తర బస్తర్, మహారాష్ట్రలోని గడ్చిరోలీ, అబూజ్‌మఢ్ కారిడార్లు ఇక్కడే కలుస్తాయి. ఈ ప్రాంతం మావోయిస్టులకు కంచుకోటలాంటిది. ఈ నెల 5వ తేదీ నుంచి భారీ సంఖ్య లో మావోయిస్టులు బినాగుండా గ్రామ సమీపాన సమావేశమైనట్టు తెలుసుకొన్న బీఎస్‌ఎఫ్, డీఆర్‌జీ బలగాలు కూంబింగ్ మొదలుపెట్టా యి. దాదాపు 180 మంది భద్రతా సిబ్బంది మావోయిస్టు క్యాంపును చుట్టుముట్టడంతో మంగళవారం మధ్యా హ్నం 2 గంటల సమయంలో ఎదురుకాల్పులు మొదలయ్యాయ ని బీఎస్‌ఎఫ్ ప్రతినిధి తెలిపారు.  

అగ్రనేతలు హతం

ఎన్‌కౌంటర్‌లో నార్త్ బస్తర్ డివిజన్ కమి టీ సభ్యులు, మావోయిస్టు ఆర్టీ అగ్రనేతలైన శంకర్‌రావు, లలిత, రాజు ఉన్నట్టు పోలీసు లు అనుమానిస్తున్నారు. శంకర్‌రావు ఎన్‌కౌంటర్‌ను ఇప్పటికే ధ్రువీకరించగా, లలిత, రాజు మృతిని ధ్రువీకరించాల్సి ఉన్నది. శంకర్‌రావు అలియాస్ సిరిపల్లె సుధాకర్ స్వగ్రా మం జయశంకర్ భూపాలపల్లి జిల్లా  చల్లగరిగె చిట్యాల. తాజా ఎన్‌కౌంటర్‌లో శంకర్‌రావు భార్య సుమన అలియాస్ రజిత కూడా మరణించినట్టు సమాచారం. సుమన స్వస్థ లం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హ త్నూర్ అని తెలిసింది. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47, మూడు ఎస్‌ఎల్‌ఆర్, రెండు పిస్తోళ్లు, రెండు ఇన్‌సాస్ తుపాకులు, రెండు 303 రైఫిల్స్ స్వాధీనం చేసుకొన్నట్టు ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. శంకర్‌రావు తలపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. ఎదురు కాల్పుల్లో గాయపడ్డ ముగ్గరు భద్రతా సిబ్బందిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.